- 17 రకాల వ్యాపారాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం
- క్వాలిటీ పాటించని కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వొద్దు
- మంత్రి సీతక్క
ములుగు/తాడ్వాయి, వెలుగు : రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క చెప్పారు. ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలతో పాటు, 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ములుగు కలెక్టర్ దివాకర్‌తో కలిసి గురువారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తి అయిన పనులకు ప్రారంభోత్సాలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ములుగు జిల్లాలో 20 ఎకరాల స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి మహిళలకు అప్పగిస్తామని ప్రకటించారు. వడ్డీ లేని రుణాలు తీసుకుంటున్న మహిళలు సకాలంలో తిరిగి చెల్లిస్తే, మళ్లీ పెద్ద మొత్తంలో లోన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహిళలు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా డీఆర్డీఏ ఆఫీసర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు.
ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. జిల్లాలోని మారుమూల తండాలు, గూడేలకు కనెక్టివిటీ రోడ్లను నిర్మిస్తామని, ప్రతీ గ్రామానికి బీటీ రోడ్డు వేయాలన్న ఉద్దేశంతో కోట్లాది రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ములుగులో ఆధునిక బస్టాండ్‌తో పాటు ఏటూరునాగారంలో బస్ డిపో, మంగపేటలో బస్టాండ్ నిర్మించి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. క్వాలిటీ పాటించని కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వొద్దని ఆఫీసర్లను ఆదేశించారు. ములుగు జిల్లాను టూరిజం, ఆధ్యాత్మిక హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను రూ.100 కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. రామప్ప సరస్సు మధ్యలో ఐలాండ్ ఏర్పాటు చేసి పర్యాటకులు ఆకట్టుకునేలా పనులు పూర్తి చేస్తామన్నారు. ములుగు జిల్లాకు భవిష్యత్‌లో నర్సింగ్ కాలేజీ కూడా వస్తుందన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించి, త్వరలోనే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఇటీవల భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి ఫ్యామిలీలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర సంపత్‌రావు, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్, నాయకులు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, పల్లె జయపాల్‌రెడ్డి పాల్గొన్నారు.