కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
  • తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ 
  • పరువు నష్టం కింద 100 కోట్లు చెల్లించాలని,క్షమాపణ చెప్పాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: తన ప్రతిష్టకు భంగం కలిగేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నదని మంత్రి సీతక్క మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ కు, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఆ నోటీసులను తన అడ్వొకేట్ నాగులూరి కృష్ణకుమార్ ద్వారా హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి పోస్టు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు లిఖితపూర్వకంగా, మీడియాలో టెలికాస్ట్ చేసేలా వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే  చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 

ఈ తప్పుడు ప్రచారం వల్ల తన పరువుకు భంగం కలిగిందని, పరువు నష్టం కింద రూ.100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, “ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసుర రాజ్యం” అంటూ సీఎం రేవంత్, సీతక్కతో పాటు మరికొందరు మంత్రుల‌‌‌‌పై కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నోటీసుల్లో అడ్వొకేట్ పేర్కొన్నారు. ‘‘ఆ వీడియోకు సీఎం, సీతక్క ఫొటోలను జత చేశారు. దాన్ని ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో సర్క్యులేట్ చేశారు. జూన్ 24న బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్టులు పెట్టారు” అని అన్నారు. ఆ వీడియో లింక్ ను కూడా నోటీసుల్లో ఇచ్చారు.