హైదరాబాద్, వెలుగు: ఈ నెల 26న జరిగే ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేకంగా లేఖలు పంపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామ పంచాయతీల్లో ‘ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల’ను నిర్వహించనున్నారు.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,750 కోట్లు నిధులతో గ్రామ పంచాయతీల్లో పనులను చేపట్టనున్నారు. ఈ పనుల్లో స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో మంత్రి సీతక్క వారికి లేఖలు రాశారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. అందులో 95 గ్రామీణ నియోజకవర్గాలున్నాయి. ఈ 95 మంది ఎమ్మెల్యేలకు వేర్వేరుగా లేఖలు పంపించారు. కాగా, ఈ నెల 26 వ తేదీ నుంచి గ్రామాల్లో అభివృద్ధి పనులు మొదలు కాబోతున్నాయి. రూ.1,372 కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.1,378 కోట్ల సీఆర్ఆర్ నిధులు కలిపి మొత్తం రూ.2,750 కోట్లు నిధులతో గ్రామాల్లో పలు పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.