
- చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన మినిస్టర్ సీతక్క
- డయల్ 181 లో కాల్ స్వీకరించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ ను సోమవారం ఆ శాఖ మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డయల్ 181 ద్వారా కాల్ సెంటర్ కి వచ్చిన ఫోన్ కాల్ ను స్వయంగా అటెండ్ చేశారు. అయితే, అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని దేవరకొండ నుంచి లలిత అనే యువతి మంత్రికి ఫిర్యాదు చేశారు.
తనను, తన ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపించారని మంత్రికి గోడు వెళ్లబోసుకుంది. దీంతో బాధితురాలి సమస్యను విన్న మంత్రి.. ఆందోళన వద్దని, తగిన సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బాధితురాలి భర్తకు కౌన్సెలింగ్ ఇప్పిస్తామని.. అయినా మారకపోతే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు.
నల్గొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు మీ వద్దకు వస్తారని మంత్రి తెలిపారు. వచ్చిన ఫిర్యాదును వెంటనే స్థానిక సఖీ సెంటర్ కి పంపి ఫాలో అప్ చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు డయల్ 181 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయగా.. ప్రతి రోజూ సుమారు వంద కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ లో వచ్చే ఫిర్యాదులపై స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సఖీ సెంటర్ నిర్వాహకులు, స్థానిక పోలీసు లను కాల్ సెంటర్ నిర్వాహకులు అప్రమత్తం చేస్తున్నారు.
చైర్ పర్సన్, మెంబర్లకు ఇంటర్వ్యూలు
మధురానగర్ లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (టీఎస్ సీపీసీఆర్) చైర్ పర్సన్, సభ్యుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూ బోర్డులో మంత్రి సీతక్క, మెంబర్లు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, జడ్జి పంచాక్షరి ఉన్నారు. చైర్ పర్సన్ కోసం సోమవారం పది మందిని, మెంబర్ల కోసం 23 మందిని ఇంటర్వ్యూ చేశారు. బుధవారం మరికొంత మందిని ఇంటర్వ్యూ చేయనున్నట్టు తెలుస్తోంది.