ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బంది పెడ్తున్నరు..మంత్రి సీతక్కతో భేటీలో ట్రైబల్ ఎమ్మెల్యేల ఆవేదన

ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బంది పెడ్తున్నరు..మంత్రి సీతక్కతో భేటీలో ట్రైబల్ ఎమ్మెల్యేల ఆవేదన
  • సాగు భూముల్లో బోర్లు, పవర్​లైన్స్ వేయనివ్వట్లేదు

హైదరాబాద్, వెలుగు: ఏజెన్సీ ఏరియాలోని సాగు భూముల్లో బోర్లు వేయకుండా, పవర్ లైన్స్ రానీయకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని మంత్రి సీతక్కకు ట్రైబల్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. త్వరలో అటవీ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యేలకు మంత్రి హామీ ఇచ్చారు.

బుధవారం హైదరాబాద్​లోని డీసీసీ భవన్​లో గిరిజన ఎమ్మెల్యేలతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఎంపీ బలరాం నాయక్, విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్,  రామ్ దాస్ నాయక్, వెడ్మ బొజ్జు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ట్రైబల్ సెక్రటరీ శరత్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గిరిజన, ఆదివాసీల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలపై మంత్రికి ఎంపీ, ఎమ్మెల్యేలు సలహాలు, సూచనలు చేశారు. 3 ఎస్టీ కార్పొరేషన్లను బలోపేతం చేయాలని, హైదరాబాద్​లో 2 పోస్ట్ మెట్రిక్ స్కాలర్​షిప్ హాస్టళ్లు నిర్మించాలని, అదనంగా 250 ఓవర్​సీస్ స్కాలర్​షిప్​లు మంజూరు చేయాలని, మరో 2 ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ గిరి వికాసం స్కీమ్​ను పునరుద్ధరించాలని సమావేశంలో నిర్ణయించారు. గిరిజనులకు ఆర్దిక చేయూత ఇచ్చేందుకు రూ.100 కోట్ల ట్రైకార్ సబ్సిడీ నిధులను విడుదల చేయాలని ఎమ్మెల్యేలు మంత్రి సీతక్కను కోరారు.

నిధులు కేటాయించాలని సీఎంను కోరుదం: మంత్రి సీతక్క

రాష్ట్రంలో ఎస్టీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అధికారులు నివేదిక సమర్పించాలని, ఇందుకు అనుగుణంగా బడ్జెట్​లో నిధులు కేటాయించాలని సీఎంను కోరుదామని మంత్రి సీతక్క ఎమ్మెల్యేలతో అన్నారు. గిరిజన ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీటింగ్​లో  సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. ప్రస్తుత సమావేశ నిర్ణయాలను సీఎంతో గురువారం ప్రత్యేకంగా సమావేశమై వివరిద్దామన్నారు.

సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు రూ.2 కోట్లు కేటాయిస్తున్నామని, ఫిబ్రవరి 15న ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందామన్నారు. గిరిజన ప్రాంతాల్లో, ఐటిడిఏ ఏరియాల్లో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన పాఠశాలల్లో, హాస్టళ్లలో తాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, భవనాల నిర్మాణానికి రూ.250 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. గిరిజన స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీలు, హాస్టల్లో సిబ్బంది ఖాళీల జాబితాను సమర్పించాలని ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క సూచించారు. 

బీఆర్ఎస్​కు కులగణనపై మాట్లాడే హక్కు ఎక్కడిది?

కులగణనను బహిష్కరించాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్​కు దానిపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని మంత్రి సీతక్క ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్ లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్​లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడా రు. కేసీఆర్ సొంత కుటుంబ గణనను చేశారని, కులగణనను చేయలేదన్నారు.  బీఆర్ఎస్​లో గత పదేండ్లు సీఎం పదవి, పార్టీ అధ్యక్ష పదవి ఒక్కరికే ఉందని తెలిపారు.

3గత 20 ఏండ్లలో ఒక్క బీసీ నేతలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలే దని ఆరోపించారు. కుల గణనలో ఎక్కడా లెక్క తప్పులేదని, ఆయా సామాజిక వర్గాల లెక్కలు పక్కగా ఉన్నాయన్నారు. దీనిపై తీన్మార్ మల్లన్న మాట్లాడిన తీరును ఆయనకే వదిలేస్తున్నామని వివరించారు. ఏమైనా అభ్యంతరాలుంటే పార్టీ వేదికలపై మాట్లాడాలన్నారు. కుల గణనను విమర్శించే మాజీ మంత్రి తలసాని తన వివరాలను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ముఖాముఖి కార్యక్రమంలో ప్రజల నుంచి ఎక్కువగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల గురించే అర్జీలు వస్తున్నాయని తెలిపారు.