- సెల్ ఫోన్ తో టైమ్ వెస్ట్ చేసుకోవద్దు
- యవతకు మంత్రి సీతక్క హితవు
ఆసిఫాబాద్, వెలుగు : యువత చేతిలో మొబైల్ ఉంది కదా అని ఏదిపడితే అది చూసి టైమ్ వేస్ట్ చేసుకోవద్దని, టైమ్ ఉన్నప్పుడు మోటివేషన్ వీడియోలు చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రూ. కోటీ 50 లక్షలతో నూతనంగా నిర్మించిన లైబ్రరీ భవనాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కలెక్టర్ వెంకటేశ్దౌత్రే, ఎస్పీ సురేశ్ కుమార్ తో కలిసి ఆమె ప్రారంభించారు.
అనంతరం స్టడీ సర్కిల్ ను విజిట్ చేశారు. అనంతరం కెరమెరి మండలం జోడేఘట్ గ్రామాన్ని కలెక్టర్ వెంకటేశ్దోత్రే, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, ఎస్పీ సురేశ్ కుమార్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుతో కలిసి సందర్శించారు. కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు పట్టుదల, నమ్మకం ఉంటేనే జీవితంలో ఎదుగుదల ఉంటుందన్నారు. లక్ష్య సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.
తాను కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.
అనంతరం గుండి వంతెనను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం వానకాలంలోపు కంప్లీట్ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ జీవిత చరిత్ర, పోరాట గడ్డ జోడేఘాట్ ప్రాంతానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. జల్-జంగల్-జమీన్ అనే నినాదంతో ఆదివాసుల హక్కులు, భూమి, భుక్తి కోసం నిజాం సర్కారుతో వీరోచిత పోరాటం చేసి కుమ్రంభీమ్ఆదర్శవంతంగా నిలిచారని తెలిపారు. కుమ్రంభీమ్ పోరాడిన ఈ పుణ్యభూమిని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. జోడేఘాట్ పరిధిలోని 16 గ్రామాలకు రోడ్లు , పక్కా ఇండ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసిఫాబాద్ నుంచి నేరుగా జోడేఘాట్ కు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కుమ్రంభీం మనుమడు కుమ్రం సోనేరావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు
పాల్గొన్నారు.