![వైభవంగా సమ్మక్క, సారలమ్మ జాతర](https://static.v6velugu.com/uploads/2025/02/minister-seethakka-offers-prayers-at-sammakka-and-saralamma-fair_TklR36CsNZ.jpg)
- వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
కరకగూడెం, వెలుగు : కరకగూడెం మండలంలోని చిరుమల్లలో గురువారం సమ్మక్క, సారలమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, పినపా క ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర సమ్మక, సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. కొమ్ము నృత్య కలాకారులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జాతర ప్రాంగణంలో అన్ని రకాల అభివృద్ధి పనులకు సహకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న జాతర ఏర్పాట్ల కోసం ఐటీడీఏ ద్వారా రూ.5లక్షలు శాంక్షన్ చేయించినట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కలగకుండా జాతర నిర్వహణ కమిటీ చూసుకుంది.
బెండాలపాడులో...
చండ్రుగొండ : సమక్క సారక్క మినీ జాతర గురువారం బెండాలపాడు గ్రామ శివారులోని కనిగిరి గుట్టల సమీపంలో ప్రారంభమైంది. తహసీల్దారు సంధ్యారాణి, డీటీ ప్రసన్న, మాజీ జడ్పీటీసీ వెంకటరెడ్డి గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు.
ఎదిర గుట్టల్లో..
భద్రాచలం : చర్ల మండలం ఎదిర గుట్టల్లో గురువారం గద్దె పైకి సారలమ్మ అమ్మవారు వచ్చారు. సారలమ్మను అడవుల నుంచి మేళతాళాలతో దేవర బాలలు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్ కు చెందిన ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సారలమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్చైర్మన్ పొదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అమ్మవారిని దర్శించుకున్నారు.