
- మేడారం మహాజాతర పనులపై అంచనాలు రూపొందించాలి
- మంత్రి సీతక్క సూచన
ములుగు/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ఆఫీసర్లు ఫీల్డ్ లెవల్‌లో పర్యటిస్తూ అభివృద్ధి పనుల క్వాలిటీని పరిశీలించడంతో పాటు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై అన్ని శాఖల ఆఫీసర్లు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. పనులు చేసే కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ములుగులో కలెక్టర్ దివాకర, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్‌తో కలిసి ఆదివారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని సూచించారు. వేసవి కారణంగా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఐటీడీఏ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
మేడారం మహాజాతరను పురస్కరించుకొని చేపట్టనున్న పనులపై అంచనాలు తయారు చేయాలని, జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను క్లీన్ చేసుకోవాలని, చెరువులు, కుంటల్లో నీరు లేని టైంలో రిపేర్లు చేయాలని సూచించారు.
అనంతరం ములుగు మండలం రాంచంద్రాపురం, జంగాలపల్లి, కాసిందేవిపేట గ్రామాల్లోని కాల్వల కింద భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడి, సరైన పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులు భూ సేకరణకు సహకరించాలని, రామప్ప, లక్నవరం కెనాల్ వల్ల జంగాలపల్లి, కాశీందేవిపేట రైతుల భూములకు సాగునీరు అందడంతో పాటు లక్నవరం జలాశయం పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
రామచంద్రపురం ద్వారా వెళ్లే 1 ఆర్, 2 ఆర్డిస్ట్రిబ్యూషన్ కాల్వల కింద వ్యవసాయ భూములకు సాగు నీరు అందుతుందన్నారు. అంతకుముందు ములుగులోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కాన్ఫరెన్స్ హాల్‌ను ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొని కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రాతో కలిసి కేక్ కట్ చేశారు.
మహిళా ఆఫీసర్లకు, ఉద్యోగులకు నిర్వహించిన పోటీల్లో గెలిచిన వారికి, ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని రాఘవపట్నం గ్రామంలో ఇందిరమ్మ మోడల్ హౌజ్ నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు.