
- సెంటర్లలో చిన్నారుల సంఖ్యపెంచే బాధ్యత అధికారులదే
- మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్‌లు ఇస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంచి గ్రేడింగ్ వచ్చే కేంద్రాలకు అధికారులు అవార్డులు అందజేస్తారని చెప్పారు. గురువారం సెక్రటేరియెట్ లో మహిళా, శిశు సంక్షేమ శాఖపై సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చిన్నారులు లేని కేంద్రాలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు షిప్ట్ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 313 కేంద్రాలు ఇంకా ఓపెన్ కాలేదని వివరించారు. ప్రతి కేంద్రంలో 20 మంది ఉండాలని, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు లేరనే కారణాలు చెప్పొద్దని, వారి సంఖ్య పెంచే బాధ్యత అధికారులదే అని మంత్రి వెల్లడించారు. బడి బాట తరహాలో గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చిన్నారులను గుర్తించి అంగన్వాడీలకు వచ్చేలా కృషి చేయాలన్నారు. పోషకాహార తెలంగాణే లక్ష్యంగా అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేయాలని సూచించారు.
జిల్లా అధికారులు వారానికి మూడు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 30 అంగన్వాడీ కేంద్రాల్లో అసలు పిల్లలు లేరని, 198 కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య 5లోపే ఉందని, 586 కేంద్రాల్లో పదిలోపే ఉన్నారని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం చిన్నారుల సంక్షేమంపై వందల కోట్లు ఖర్చు చేస్తున్నదని, అధికారులు సీరియస్ గా ఉంటేనే లక్ష్యాలు నెరవేరుతాయన్నారు.
నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు.. అధికారులపై ఆగ్రహం
కంది పప్పు కోనుగోలు విషయంలో సొంత నిర్ణ యాలు తీసుకోవడంతో అధికారులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ టెండర్ విధా నాన్ని పాటించకుండా నామినేషన్ పద్ధతిలో పాత కాంట్రాక్టర్లకు కొంత మంది అధికారులు ఎందుకు కట్టబెట్టారని మంత్రి ప్రశ్నించారు. ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులు చేస్తున్న తప్పులతో ప్రభుత్వం బద్నాం అవుతున్నదన్నారు.
పాత కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిని నిలిపివేసి ఈ- టెండర్ విధానాన్ని అమలు చేయాలని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డీపీసీ (డిస్ట్రిక్ ప్రొక్యూర్ మెంట్ కమిటీ) ద్వారా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. హైదరాబాద్ జిల్లాలో కోడిగుడ్ల సరఫరా సరిగ్గా చేయకపోవడంతో ఓ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని, తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు.