- వేసవిలో తాగునీటి సమస్యల నివారణకు చర్యలు: మంత్రి సీతక్క
- అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి
- ఆర్వో నీళ్లతో జనం సమస్యల బారినపడుతున్నరు
- ఎంతమంది భగీరథ నీళ్లు తాగడం లేదో సర్వే చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల1 నుంచి10వ తేదీ వరకు మిషన్ భగీరథపై సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ లో డీపీఓ, డీఎల్పీఓలు, ఎంపీఓలు, విలేజ్ సెక్రటరీలు, సీఈలు, ఏఈఈలు భగీరథ పంపులు, నల్లా పైపులను తనిఖీ చేయాలన్నారు. నీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే ఆల్టర్నేటివ్ పద్ధతిలో నీటిని సరఫరా చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ఆఫీసులో అధికారులతో మంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
వచ్చే ఐదు నెలల కోసం భగీరథ సిబ్బంది ప్రణాళిక రూపొందించుకోవాలని, వేసవి ముగిసే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో ఒక్కో మనిషికి రోజూ 100 లీటర్ల నీటిని అందించాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో క్రీమ్ కమిటీ వేసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతోపాటు భగీరథ నీళ్లపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. ‘‘భగీరథ నీటి వల్ల ఎవరూ అనారోగ్యం బారిన పడకూడదు.
ఆ బాధ్యత ఇంజినీర్లదే. అడవుల్లో తిరిగినప్పుడు నేను అన్ని రకాల నీళ్లు తాగినా ఏమీ కాలేదు. కానీ ఇప్పుడు ప్రజలు ఆర్వో ప్లాంట్లకు అలవాటై సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు” అని మంత్రి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా రూ. వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇస్తున్నా.. ప్రజలు ఎందుకు తాగడం లేదో అధ్యయనం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎంత మంది భగీరథ నీళ్లు తాగడం లేదో సర్వే చేయాలన్నారు. నియోజకవర్గాల వారిగా ఎన్ని ఇండ్లకు నీళ్లు అందడంలేదన్న వివరాలను ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంతో తప్పులు చేస్తే సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీర్స్ అసోసియేషన్ డైరీని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విద్యతోనే వికాసం..
విద్యతోనే వికాసం సాధ్యపడుతుందని మంత్రి సీతక్క అన్నా రు. హైదరాబాద్ లకిడికాపూల్ లోని ఎఫ్ టీసీసీఐ కార్యాలయంలో విద్యాధన్ స్వచ్ఛంద సంస్థ స్కాలర్షిప్ ల కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చిన విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏండ్ల పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య అవకాశం ఉందన్నారు. విద్య ద్వారానే తన లైఫ్ ఈ స్థాయికి వచ్చిందనిన్నారు. టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత పదేళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపానని, బయటకొచ్చిన తర్వాత తిరిగి విద్యార్థిగా చదువు కొనసాగించానని చెప్పారు. విద్యతో పేదల జీవితాలను మార్చేందుకు కృషి చేస్తున్న విద్యాధన్ ఫౌండేషన్ కు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు.
పథకాలు ప్రకటించి మర్చిపోవడం బీఆర్‌ఎస్ నైజం
ఎన్నికలకు ముందు పథకాలు ప్రకటించడం.. అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోవడం బీఆర్‌ఎస్ పార్టీ నైజం అని మంత్రి సీతక్క విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుబంధు, హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం దళిత బంధు, జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇంటికి రూ.పది వేలు, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ బంధు, మైనార్టీ బంధు పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్న చరిత్ర బీఆర్ఎస్‌దని బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవ ఇండ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు తగ్గించి, ఇంట్లో కూర్చోని లబ్ధిదారుల జాబితాను రెడీ చేసిన మిమ్మల్ని.. ప్రజలే ఇంట్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు.
ప్రజల సమక్షంలో పథకాల అర్హులను ఎంపిక చేస్తుంటే తట్టుకోలేక అమాయకులను ఆత్మహత్యలు చేసుకునేలా రాజకీయాలు చేస్తున్నది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మరుపులు.. అధికారం పోగానే అరుపులు అన్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడుతో సహా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా.. అక్కడే రైతుబంధు నిధులు విడుదల చేసిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని విమర్శించారు. నాట్ల ముందు కాకుండా.. ఓట్లకు ముందు నిధులు విడుదల చేసినందుకే ప్రజలు బుద్ధి చెప్పారని ఫైర్ అయ్యారు. ప్రజలను ఓట్ల యంత్రాలుగా చూసినందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారన్నారు. అధికారం దూరం కావడాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు.
గిరిజన ఉద్యోగ, విద్యార్థి సంఘాలతో సమావేశం..
సెక్రటేరియెట్లో మంత్రి సీతక్కతో ఎంపీ బలరాం నాయక్, విప్, ఎమ్మెల్యే రామచంద్రనాయక్, గిరిజన ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధుల సమావేశమయ్యారు. అన్ని గిరిజన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా గిరిజన సంఘాలతో సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి రోజు ఫిబ్రవరి 15లోపు గిరిజన సల హా మండలి ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు. గోర్ బోలి, ఆదివాసీ భాషలను రాజ్యంగంలో 8వ షెడ్యుల్‌లో చేర్చేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చర్చించారు.