హనుమకొండ: ఎస్ఆర్ యూనివర్సిటీ విద్యార్థి దీప్తి ఆత్మహత్యకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ సమీపంలో ఉన్న ఎస్ఆర్ ప్రైవేటు యూనివర్సిటీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నదీప్తి.. శుక్రవారం (జనవరి12) న ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దీప్తి మరణంపై తగిన విచారణ జరపాలని.. ఆత్మహత్య వెనుక ఉన్న దోషులను గుర్తించాల్సిందిగా వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝాకు ఫోన్ చేసి ఆదేశించారు. దీప్తి మరణానికి కారణమైన వారిని చట్టమే శిక్షిస్తుందన్నారు. ఆమె ఆత్మహత్యకు కారకులు ఎంతటి వారైనా రాష్ట్ర ప్రభుత్వం వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. దీప్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.