- ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ములుగు/ కొత్తగూడ, వెలుగు : రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడం కోసమే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన హామీలను అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గత పాలకులు చేసిన అప్పులు ఉన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేకమంది అమరులయ్యారని, ఉద్యమాన్ని గ్రామ గ్రామాన లేవనెత్తిన గొప్ప వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల కోరిక మేరకు మల్లంపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేశారని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు.
ALSO READ | స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీఎం చొరవతోనే కేంద్ర ప్రభుత్వం యూనిస్కో గుర్తింపు పొందిన రామప్పకు రూ.73కోట్లు కేటాయించిందని, ఆ నిధులతో రామప్పలో ఐలాండ్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. విజయోత్సవ కార్యక్రమంలో అంతడుపుల నాగరాజు కళాబృందం ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ప్రజా పాలన విజయోత్సవ ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. అంతకుముందు గంగారం, కొత్తగూడ మండలాల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఆయా మండలాల అభివృద్ధికి అధికారులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో మధుసూదనరాజు, డీపీవో హరిప్రసాద్, పీఆర్ఎస్ఈ అజయ్‌కుమార్, ఈఈ విద్యాసాగర్, రెండు మండలాల ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలను అమలు చేశాం
రేగొండ: కాంగ్రెస్ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పదినెలల్లోనే అమలు చేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలను శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఏఎంసీ చైర్మన్గూటోజు కిష్టయ్య, మండలాధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, ట్రేడ్కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.