- రాముడి పేరుతో బీజేపీ రాజకీయం
- పదేండ్లలో మోదీ చేసిందేమీ లేదు
- కాంగ్రెస్ తోనే సుస్థిర పాలన
- ఆత్రం సుగుణ గెలుపు ఖాయం
- ప్రచారంలో మంత్రి సీతక్క
కుంటాల /జన్నారం, వెలుగు : కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. త్యాగాల పార్టీకి ప్రజలు అండగా నిలిచి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కుంటాల మండలంలోని కల్లూర్లో, జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తామని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. దేశంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తూ ఆ పార్టీలను ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. మతం పేరుతో బీజేపీ ప్రజలను విడదీస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ చేశారని ఆరోపించారు. ఆరు నూరైనా ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తామన్నారు. విద్యావంతురాలు, జిల్లా ప్రజల గొంతుక అయిన ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు కల్లూర్ సాయిబాబా ఆలయంలో మంత్రి సీతక్క, సుగుణ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు, మాజీ ఎమ్మెల్యేలు నారాయణ రావు పటేల్, రేఖా నాయక్, విఠల్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్, నాయకులు బోజరాంపటేల్, బుచ్చన్న, ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు
శ్రీరాముడి పేరుతో రాజకీయం చేయడం తప్పబీజేపీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి సీతక్క ఆరోపించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఏంపీ అభ్యర్థి అత్రం సుగుణకు మద్దతుగా జన్నారం మండలంలోని రాంపూర్, తిమ్మాపూర్, తపాలపూర్ గ్రామాల్లో శనివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ.. శ్రీరాముడు ఒక్క బీజేపీకే దేవుడు కాదని, అందరికీ ఆయన దేవుడేనన్నారు. రాముని అక్షింతలు పంచుతూ ఆ పార్టీ ఓట్లడుగుతోందని..
దేవుడి అక్షింతలు ముఖ్యం కాదని అభివృద్ధి, యువతకు ఉపాధి, ఉద్యోగ ఆవకాశాలు ముఖ్యమన్నారు. గడిచిన పదేండ్ల కాలంలో ప్రధాని ఈ అంశాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన కేసీఆర్ లక్షల కోట్లలో అప్పులు చేశాడని, ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మూడు సంవత్సరాల్లోనే పిల్లర్లు కుంగిపోయాయని విమర్శించారు.
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే ఇపుడు కేంద్రంలోని బీజేపీ ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని మరోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే ఆవకాశముందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలకు రోజుకు రూ.400 వేతనం చెల్లిస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోడెం నగేశ్ గతంలో ఏంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసినప్పటికీ జిల్లా ప్రజలకు చేసింది ఎమీలేదన్నారు. జిల్లాలో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టిన అత్రం సుగుణను ఎంపీగా గెలిపించాలని కోరారు.
అనంతరం అత్రం సుగుణ స్వగ్రామమైన తిమ్మాపూర్ లో ఆమె తల్లి భూదవ్వను మంత్రి సీతక్క కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, సీనియర్ లీడర్లు రాజశేఖర్, సయ్యద్ ఇసాక్, రియాజోద్దిన్, ముత్యం సతీశ్, ముత్యం రాజన్న, మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.