లోపాలను చూసి కుంగిపోవద్దు..ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి : మంత్రి సీతక్క

లోపాలను చూసి కుంగిపోవద్దు..ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి : మంత్రి సీతక్క
  • దివ్యాంగుల దినోత్సవాల్లో మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: దివ్యాంగులు తమకు ఉన్న లోపాలను చూస్తూ కుంగిపోవద్దని, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం హైదరాబాద్  రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాలకు మంత్రి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు అమర్చారు. ఉద్యోగాలు సాధించిన దివ్యాంగులతో పాటు, క్రీడలు, సామాజిక సేవలో విశిష్ట ప్రతిభ కనబరిచిన సామాజిక కార్యకర్తలు, దివ్యాంగుల సంఘాల నేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దివ్యాంగులుగా ఉండి సివిల్స్ తో పాటు, కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల్లో ఉద్యోగాలు సాధించిన వారిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

వెల్ఫేర్  హాస్టల్స్ లో చదివి 87 మంది ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం తమ ప్రజాప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల మంది వికలాంగులు ఉన్నారని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేకంగా జాబ్ పోర్టల్ ను తీసుకొచ్చామని చెప్పారు. అర్హులైన దివ్యాంగులకు ఆసరా పెన్షన్  ఇస్తామన్నారు. వికలాంగుల చైర్మన్  ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ..వికలాంగుల సంక్షేమ శాఖ, వికలాంగుల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్  ప్రభుత్వమేనని చెప్పారు. 40 శాతం వైకల్యం ఉన్నవారికి పరికరాలు అందజేస్తామని ఆయన ప్రకటించారు.