పచ్చదనంతోపాటు పరిశుభ్రత అలవరుచుకోవాలి

  • పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

ములుగు(గోవిందరావుపేట), వెలుగు : ప్రతి ఒక్కరూ పచ్చదనంతోపాటు పరిశుభ్రతను అలవర్చుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మంగళవారం గోవిందరావుపేట మండలం చాల్వయిలోని బుస్సాపూర్ క్రాస్​ రోడ్డులోని 5వ బెటాలియన్ క్యాంపులో మంత్రి స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమ ప్రత్యేక అధికారి, లేబర్ శాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజ, ఓఎస్డీ మహేశ్ బాబా సాహెబ్ గీతే, డీఎఫ్ వో రాహూల్ కిషన్ జాదవ్, సీఎంటీ అలెక్ తో కలసి మొక్కలు నాటారు. అనంతరం వ్యాస రచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛదనం–పచ్చదనంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని, మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అంతకుముందు చల్వాయిలోని పోలీసు బెటాలియన్​ క్యాంపులో మంత్రి సీతక్క జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, మండల ప్రత్యేకాధికారి విజయ చంద్ర తదితరులు పాల్గొన్నారు. 

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించాలి..

ములుగు జిల్లా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలను కేటాయించాలని ప్రెస్ క్లబ్​ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.శంకర్, ఎ.కొమురయ్య కోరారు. ఈమేరకు మంగళవారం మంత్రి సీతక్కను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు చుంచు రమేశ్, జాయింట్ సెక్రటరీ ఆలుగొండ రమేశ్, కోశాధికారి సంగ రంజిత్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.