మీలెక్క నేను కోటల్లో ఉంటలేను : మంత్రి సీతక్క

మీలెక్క నేను కోటల్లో ఉంటలేను : మంత్రి సీతక్క
  • నేనుండేది ప్రభుత్వ భవనంలో.. నా సొంత భవనం కాదు: మంత్రి సీతక్క
  • ఐదెకరాల ఇంట్లో ఉంటున్నారన్న కౌశిక్​ రెడ్డి కామెంట్లపై ఆగ్రహం
  • కొత్త సభ్యుడికి హరీశ్​రావు ఇదే నేర్పిస్తున్నరా?: శ్రీధర్​ బాబు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ నేతల్లాగా ఎకరాలకు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో ఉండడం లేదని మంత్రి సీతక్క అన్నారు. ఆ పార్టీ నేతలు తన ఇంటికి భోజనానికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. తాను ఉంటున్నది ప్రభుత్వం కేటాయించిన భవనమని.. తన సొంత బిల్డింగ్ కాదన్నారు. శనివారం జీరో అవర్ ​సందర్భంగా బీఆర్ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి సీతక్క 5 ఎకరాల బంగ్లాలో ఉంటున్నారని.. తాను 500 గజాల ఇంట్లో ఉంటున్నానన్నారు. 

ఆమె నియోజకవర్గానికి వెళ్లడం లేదన్నారు. కౌశిక్​రెడ్డి కామెంట్లకు మంత్రులు సీతక్క, శ్రీధర్​బాబు కౌంటర్ ఇచ్చారు. మర్యాదగా మాట్లాడాలంటూ శ్రీధర్ బాబు వార్నింగ్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్​కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని చెప్పారు.

వ్యవసాయ శాఖకు రూ.50 వేల కోట్లు ఎందుకు తగ్గినయ్: కౌశిక్​ రెడ్డి

గత బడ్జెట్​లో వ్యవసాయ శాఖకు రూ.76 వేల కోట్లు పెడితే ఇప్పుడు రూ.24 వేల కోట్లకు తగ్గించారని కౌశిక్​ రెడ్డి విమర్శించారు. రూ.50 వేల కోట్లు ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు. మంత్రి సీతక్క ములుగుకు వెళ్తలేరని, హైదరాబాద్​లోనే ఉంటూ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ఆమె 5 ఎకరాల భవంతిలో నివసిస్తుంటే.. తాను 500 గజాల ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు.  కౌశిక్ వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ ఫైరయ్యారు. 

నాలాగా నువ్వు తిరగలేవ్​: సీతక్క

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ఉండడంతోనే తాను హైదరాబాద్​లో ఉండిపోయానని చెప్పారు. నిత్యం తాను ప్రజల్లోనే ఉంటానని, ఆ విషయం అందరికీ తెలుసన్నారు. ‘‘నీ నియోజకవర్గంలో నువ్వు ఎన్ని రోజులు తిరిగావో.. నేను ఎన్ని రోజులు తిరిగానో తేల్చుకుందాం. 

నీ లైఫ్​ స్టైల్​కు నా లైఫ్​స్టైల్​కు చాలా తేడా ఉంది. నాలాగా నువ్వు ప్రజల్లో తిరగలేవు. నేను బంగ్లాలో ఉంటున్నానని అంటున్నారు. అది ప్రభుత్వం కేటాయించిన మినిస్టర్స్ క్వార్టర్స్. మీలాగా ఎకరాలకు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో నేను ఉండడం లేదు. మా ఇంటికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. నాది ఆడంబరాల్లేని జీవితం. నా కుమారుడు కూడా హనుమకొండలోనే ఉంటున్నాడు” అని అన్నారు.

సీతక్కపై కామెట్లు అభ్యంతరకరం: శ్రీధర్​ బాబు

మంత్రి సీతక్కపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మర్యాద లేకుండా మాట్లాడడమేనా కౌశిక్​రెడ్డికి హరీశ్​ రావు నేర్పుతున్నది అని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు ఆక్షేపణీయమని, ఆ రికార్డులను సరి చేయాలని స్పీకర్​ను కోరారు. శ్రీధర్​ బాబు వ్యాఖ్యలపై స్పందించిన కౌశిక్​ రెడ్డి.. తనకు రాజకీయాలు నేర్పింది శ్రీధర్​ బాబేనని, ఆయనే తనకు ఆదర్శమన్నారు.