వృద్ధులకు అండగా ఉంటం .. పేరెంట్స్​ను కన్న బిడ్డల్లా చూస్కోవాలి: మంత్రి సీతక్క

వృద్ధులకు అండగా ఉంటం .. పేరెంట్స్​ను కన్న బిడ్డల్లా చూస్కోవాలి: మంత్రి సీతక్క
  • తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించడం బాధాకరం
  • పిల్లలు పట్టించుకోని వారి కోసం జిల్లాకో ఓల్డ్ ఏజ్ హోమ్, డే కేర్ సెంటర్
  • వయో వృద్ధుల అవగాహన ర్యాలీలో మంత్రి వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: పిల్లలు పట్టించుకోని వృద్ధులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటదని మంత్రి సీతక్క అన్నారు. వారి బాధ్యత సర్కారే తీసుకుంటదని తెలిపారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నెక్లెస్​రోడ్​లోని జల విహార్ పార్క్​లో తెలంగాణ దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్​జెండర్ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ‘‘వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం మా విధానం కాదు. కన్న పిల్లలు వదిలేస్తున్న వృద్ధులకు సంరక్షణ, సంక్షేమం కోసం ఓల్డ్ ఏజ్ హోమ్​లను పెంచాల్సి వస్తున్నది.

ప్రతి జిల్లాలో ఓల్డ్ ఏజ్ హోమ్​తో పాటు డే కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. తల్లిదండ్రుల సంక్షేమాన్ని విస్మరించిన వాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. నా శాఖను సంప్రదించండి’’అని సీతక్క సూచించారు. పిల్లలను కనీ.. పెంచి ప్రయోజకులను చేసిన వయో వృద్ధులు అందరికీ ఆదర్శనీయులు అని అన్నారు. వయసు మీద పడినవారిని వయో వృద్ధులు అనడంకంటే.. పెద్దలు అని సంబోధించడం కరెక్ట్ అని తెలిపారు.

కన్న బిడ్డల యోగ క్షేమాలు చూసుకున్నట్టే.. తమ తల్లిదండ్రులను కూడా చూసుకోవాలని కోరారు. ఒకప్పుడు ఇల్లు చిన్నదైనప్పటికీ.. మూడు తరాలు ఒకే ఇంట్లో ఉండేవాళ్లని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఎంత పెద్ద ఇల్లు ఉంటే.. అంత తక్కువ కుటుంబాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయని తెలిపారు.

డబ్బు, హోదాకు ఏం విలువ?

కొందరు ఉన్నత ఉద్యోగాలు చేస్తూ కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారని మంత్రి సీత‌‌క్క ఆవేద‌‌‌‌న వ్యక్తం చేశారు. కన్న తల్లిదండ్రులనే స‌‌రిగ్గా చూసుకోనప్పుడు డబ్బు, హోదాకు ఏం విలువ ఉంటుంద‌‌ని ప్రశ్నించారు. ‘‘సొంత పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోవాలి. వయసు మీదపడిన తల్లిదండ్రులను చిన్న పిల్లల్లా చూసుకోవాలి.

ఆస్తుల కోసం కొంద‌‌రు క‌‌న్న తల్లిదండ్రులను చంపేస్తున్నరు. వయో వృద్ధుల సంరక్షణ కోసం 2007లో నాటి యూపీఏ ప్రభుత్వం వ‌‌యో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చ‌‌ట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షలు తప్పవు. పెద్దల ఆలోచనలు, అనుభవాల ఆధారంగా వారి సంరక్షణ కోసం మరిన్ని పథకాలు తీసుకొస్తాం’’అని సీతక్క హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డైరెక్టర్ శైల‌‌జా, దివ్యాంగుల కార్పొరేష‌‌న్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

విజయ భారతికి ఘన నివాళి

పౌర హ‌‌క్కుల నేత బొజ్జా తార‌‌కం స‌‌తీమ‌‌ణి, ప్రముఖ రచయిత్రి బి.విజయ భారతి పార్థివ దేహంపై మంత్రి సీత‌‌క్క పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివారం బేగంపేటలోని నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యుల‌‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విజ‌‌య‌‌ భార‌‌తి తెలుగు అకాడ‌‌మీ డిప్యూటీ డైరెక్టర్​గా సేవ‌‌లు అందించారని గుర్తుచేశారు. సాహితీ రంగానికి విజయభారతి చేసిన సేవ‌‌లను కొనియాడారు.