గ్రామాల అభివృద్ధికి చేయూతనివ్వండి: మంత్రి సీతక్క

గ్రామాల అభివృద్ధికి చేయూతనివ్వండి: మంత్రి  సీతక్క

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేయూతనివ్వాలని  కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలను మంత్రి సీతక్క కోరారు. ఆదివారం ప్రజా భవన్​లో పలు కార్పొరేట్​ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు.  ఆదిలాబాద్, ములుగు వంటి అటవీ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని సూచించారు. 

కంపెనీలు పే బ్యాక్ టు సొసైటీ నినాదంతో తమ సామాజిక బాధ్యత, కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. ఒక లక్ష్యంతో సీఎస్ ఆర్ నిధులను వెచ్చిస్తే మార్పు వస్తుందన్నారు.  మారుమూల ప్రాంతాల్లో ఉన్న అవకాశాలు, వనరులు,  అవసరాలను కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలకు తెలియజేసేందుకు వారితో కలిసి  త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో  కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్,  సెర్ఫ్​  సీఈవో  దివ్యాదేవరాజన్, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు దివాకర్, రాజర్షి షా,  పలు కంపెనీలు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.