గ్రామీణాభివృద్ధి శాఖకు మరో వెయ్యి కోట్లు ఇవ్వండి :  మంత్రి సీతక్క

గ్రామీణాభివృద్ధి శాఖకు మరో వెయ్యి కోట్లు ఇవ్వండి :  మంత్రి సీతక్క
  • మహిళా, శిశు సంక్షేమ శాఖకు అదనంగా రూ.600 కోట్లు కేటాయించండి 
  • ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి భట్టికి మంత్రి సీతక్క విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు వచ్చే బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదనపు నిధులు కేటాయించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రాధాన్యత దృష్ట్యా గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1,000 కోట్లు, మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ.600 కోట్లు అదనంగా ఇవ్వాలన్నారు. సీతక్క విజ్ఞప్తిని పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. భట్టి అధ్యక్షతన బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రీ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖలు అందించిన బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు.

భట్టి మాట్లాడుతూ.. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు చిన్నతనంలోనే మంచి పోషక ఆహారాన్ని అందించడం వల్ల ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించే అవకాశం ఉంటుందని తెలిపారు. పిల్లలపై పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పారు. జువైనల్ హోమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పిల్లల మానసిక పరిపక్వతకు క్రీడలు దోహదం చేస్తాయని, ఇందుకుగాను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి స్పోర్ట్స్ కిట్స్ అందిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న మహిళా ప్రాంగణాల పరిస్థితిపైనా మంత్రులు ఆరా తీశారు. వాటిని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దివ్యాంగులకు స్వల్పకాలిక శిక్షణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. 

మండల కేంద్రాల్లోనూ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ల సేవలు..

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ల సేవలను మండల కేంద్రాల్లోనూ వినియోగించాలని మంత్రి సీతక్క కోరారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతోపాటు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ల క్లినిక్ సెంటర్లు మన రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్నాయని మంత్రులు వివరించారు. అనంతరం కేంద్ర సహకారంతో అమలు అవుతున్న పథకాలు, నిధుల విడుదల, భవిష్యత్తులో ఈ పథకాలకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు.

సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.