పథకాలు ప్రజలకు చేరాలి : మంత్రి సీతక్క

పథకాలు ప్రజలకు చేరాలి : మంత్రి సీతక్క
  • అన్నిశాఖల ఉద్యోగులు సమిష్టిగా పనిచేయాలి
  • రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేర్చాలని, ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ముందుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క సూచించారు. విద్య, వైద్యం, సంక్షేమాభివృద్ధి రంగాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందన్నారు.  మంగళవారం ములుగు కలెక్టరేట్ లో  కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావుతో కలిసి జిల్లా అభివృద్ధిపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

వివిధ శాఖల్లోని అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకుని.. అనంతరం మంత్రి మాట్లాడారు. అభివృద్ధి పనులపై గ్రామాల ప్రజలతో చర్చించిన తర్వాతే అంచనాలు రూపొందించి నివేదికలు అందజేయాలని పేర్కొన్నారు.  ప్రజలకు ఉపయోగపడే పనులను చేయాలని సూచించారు.  ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.  వచ్చే మినీ మేడారం జాతరకు భక్తులకు ఉపయోగపడే విధంగా శాశ్వత పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా మంజూరయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు.

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉంచుదామని, పార్టీలకు అతీతంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.అనంతరం కలెక్టర్, పీవోతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు 52 మందికి చెక్కులను అందజేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కే సత్యపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ విజయ భాస్కర్, నేషనల్ హైవే, పంచాయతీ రాజ్,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.