
- మహా జాతరకు ఘనంగా ఏర్పాట్లు
- ఇప్పటికే రూ.75 కోట్లు ఇచ్చినం
- అవసరమైతే మరిన్ని నిధులిస్తం
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
- ములుగు జిల్లాలో పర్యటన‘మేడారం’పై ఆఫీసర్లతో రివ్యూ
జయశంకర్ భూపాలపల్లి, తాడ్వాయి, వెలుగు: ‘సమ్మక్క సారలమ్మ భక్తులకు ఏ సమస్యా రావద్దు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీల మధ్య నిర్వహించనున్న మహాజాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అభివృద్ధి పనులు, ఏర్పాట్ల కోసం రూ.75 కోట్లు ఇచ్చినం. అవసరమైతే మరిన్ని నిధులిస్తం. మేడారం జాతరకు జాతీయ హోదా రావడానికి కృషి చేస్తం. జాతర నిర్వహణ కోసం చేపట్టబోయే కొన్ని పనులకు కేంద్ర నిధులు కావాలని ప్రతిపాదనలు పంపిస్తున్నం’ అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించి న తర్వాత తొలిసారి ఆదివారం ములుగు జిల్లాలో పర్యటించారు. తాడ్వాయి మండలంలోని మేడారం ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన మహాజాతరపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అంతకుముందు ములుగు గట్టమ్మ తల్లి, మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మలకు తన ఎత్తు బెల్లం సమర్పించారు.
మేడారం జాతర జాతీయ హోదాకోసం కృషి!
మేడారం తల్లులు తమ ఇంటి ఇలవేల్పులని మంత్రి సీతక్క అన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామన్నారు. ఈ జాతరకు జాతీయ హోదా తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన చేపట్టబోయే కొన్ని పనులకు సంబంధించి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. దీనికి సంబంధించిన ఫైల్ రెడీ చేసినట్లు తెలిపారు. మహాజాతర ఏర్పాట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రూ.75 కోట్లు మంజూరు చేశారన్నారు. ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర మేడారం నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. దీంతో తాము అడగ్గానే ముఖ్యమంత్రి నిధులు కేటాయించారని చెప్పారు.
టెండర్లు పిలిచినం.. నామినేషన్ పద్ధతిలో చిన్న పనులు : మంత్రి సీతక్క
మహాజాతరకు తక్కువ టైం ఉన్నప్పటికీ పక్కా ప్రణాళికలు రూపొందించామని మంత్రి తెలిపారు. కాంట్రాక్ట్ కు ఇచ్చిన పనులను క్వాలిటీతో పూర్తి చేయిస్తామన్నారు. ఎన్నికలు వచ్చినందున నిధులు రావడం ఆలస్యమైందని, మంత్రివర్గం ఏర్పడగానే ఈ నెల15న రూ.75 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చామన్నారు. గడువు తక్కువగా ఉన్నా కూడా శాశ్వత ప్రాతిపదకన పనులు చేయడంపై ఆఫీసర్లతో ప్లాన్ చేస్తున్నారన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారని, త్వరలోనే పనులు మొదలవుతాయన్నారు. రూల్స్‌కు అనుగుణంగా చిన్న పనులను నామినేషన్ పద్ధతిలో చేస్తామన్నారు. మహబూబాబాద్ ఎంపీ కవిత, ఐటీడీఏ పీవో అంకిత్, ఎస్పీ గాష్ ఆలం పాల్గొన్నారు.