పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులివ్వండి : మంత్రి సీతక్క

పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులివ్వండి : మంత్రి సీతక్క
  • ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క రివ్యూ
  • పనులు స్పీడప్​ చేయాలని అధికారులకు ఆదేశం
  • నాలుగు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నిర్మల్/ఆదిలాబాద్/బోథ్/నేరడిగొండ, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని, ఆటంకాలు లేకుండా చూడాలని జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం సీతక్క ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. నిర్మల్​జిల్లాలో మహిళా పోలీసులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శివంగి’ బృందాన్ని కలెక్టరేట్​లో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని మహిళా సమాఖ్య సంఘాలకు, మెప్మాలకు మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు. బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరు, వసూలులో నిర్మల్ జిల్లా ప్రగతిశీలంగా ఉందని అధికారులను ప్రశంసించారు. అనంతరం పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, మహిళా, శిశు సంక్షేమంపై ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. టెండర్ దశ నుంచే అభివృద్ధి పనులు వేగంగా ప్రారంభించి, వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలన్నారు.

 ఇప్పటికీ ప్రారంభం కాని పనులకు వెంటనే కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించారు. పనులు ఆలస్యం చేస్తున్న గుత్తేదారులకు నోటీసులు జారీ చేసి పనులు పూర్తి చేయించాలన్నారు. చివరి తడి వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో తాగునీటి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లాల వారీగా అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు, నేతలతో చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్, బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, హరీశ్ బాబు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఐసీడీఎస్ సెక్రటరీ అనితా రామచంద్రన్, అడషనల్​కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. 

దివ్యాంగుల ఆత్మగౌరవమే ప్రభుత్వ కర్తవ్యం

దివ్యాంగుల ఆత్మగౌరవమే ప్రజా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, వారిని ప్రభుత్వం కన్న బిడ్డల్లా చూసుకుంటోందని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజు పర్యటించిన సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఉదయం అదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో, ఇచ్చోడ హై స్కూల్​లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. దివ్యాంగులు మానసిక స్థైర్యంతో ఉండాలని, పునరుత్తేజంతో తమ జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. చిరు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా లోన్లు, ప్రత్యేకంగా వాహనాలను రూపొందిస్తున్నామని చెప్పారు.

 రైజింగ్ తెలంగాణ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో డీఎస్సీ నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోళ్లను ప్రారంభించారు. బోథ్ మడలంలోని ధన్నోరలో రూ.3 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన వీరయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, ఎస్పీ అఖిల్ మహాజన్, డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్ తదితరులున్నారు. 

కుంటాల జలపాతం అభివృద్ధికి కృషి 

రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరుగాంచిన కుంటాల జలపాతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. కుంటల జలపాతాన్ని సందర్శించిన సీతక్క అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. జలపాతానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోప్ వే, వేలాడే వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జలపాతం అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించాలని కోరుతూ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్ ఆడే గజేందర్ వినతిపత్రం అందజేశారు.