ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్​ఎస్​ కుట్రలు: మంత్రి సీతక్క

 

  • హాస్టళ్లలోని కొందరితో గులాబీ నేతల కుమ్మక్కు
  • త్వరలో అన్నీ బయటకు వస్తయ్​: మంత్రి సీతక్క
  • కుట్రల్లో ఆఫీసర్లు ఉంటే క్రిమినల్​ కేసులు పెడ్తం
  • ఇథనాల్​ ఫ్యాక్టరీకి పర్మిషన్​ ఇచ్చింది నాటి బీఆర్​ఎస్​ సర్కారే​
  • గ్రామ సభ పెట్టకుండానే అనుమతిచ్చిన్రు.. బీజేపీ మద్దతిచ్చింది
  • కేటీఆర్​.. దిలావర్​పూర్​​ రా..!  పర్మిషన్​ ఇచ్చిందెవరో తేలుద్దామని సవాల్​

హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో, సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్  ఘటనల వెనక  ఉన్న ఒక్కో రాజకీయ కుట్రను త్వరలోనే బయటపెడ్తామని మంత్రి సీతక్క అన్నారు. హాస్టళ్లలోని కొంత మందితో  బీఆర్ఎస్ నాయకులకు ఉన్న బలమైన పరిచయాలు, దీంతో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తున్నామని.. అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బద్నాం చేయాలని బీఆర్ఎస్ నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎంతోమంది అమాయక విద్యార్థులు చనిపోయారని, కనీసం వారి గురించి, వాళ్ల కుటుంబాల గురించి నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కుట్రలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని.. అన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు.

  ‘‘కేటీఆర్​.. మీ హయాంలో ఎంతో మంది పిల్లలు చనిపోయినా ఒక్కసారైనా పట్టించుకున్నవా? ఒక్క కుటుంబాన్నయినా నాటి మీ మంత్రులు పరామర్శించిన్రా? ఆదుకున్నరా? అలాంటి బీఆర్​ఎస్​ నేతలు ఇప్పుడు మొసలి  కన్నీరు కారుస్తున్నరు” అని మండిపడ్డారు. హాస్టళ్లలో జరుగుతున్న ఘటనల వెనుక కుట్రలను బయటకు తీస్తామని, ఇందులో అధికారులు ఉంటే వారిపై క్రిమినల్​ కేసులు పెడ్తామని, సర్వీస్​ నుంచి కూడా రిమూవ్​ చేస్తామని స్పష్టం చేశారు. వాంకిడి ఘటన తెలియగానే తనతో పాటు నలుగురు మంత్రులం ఫాలో అప్​ చేశామని.. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉన్నామని తెలిపారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించామని చెప్పారు. ‘‘వాంకిడి ఫుడ్ పాయిజన్  ఘటనలోని అమ్మాయి నిమ్స్ లో చికిత్స పొందుతూ చనిపోవడం బాధాకరం. మేం నలుగురు మంత్రులం అక్కడే ఉన్నం..  ఆ అమ్మాయికి రూ. 4 లక్షల ఖర్చు పెట్టినా ప్రాణం కాపాడలేకపోయినం. కార్డియాక్ అరెస్టుతో ఆ అమ్మాయి చనిపోయింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది” అని తెలిపారు. 

ఇథనాల్​ కంపెనీకి పర్మిషన్​ ఇచ్చిందే మీరు

నిర్మల్​ జిల్లా దిలావర్పూర్ లో 2022 లోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అప్పటి బీఆర్ఎస్  ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని మంత్రి సీతక్క చెప్పారు. ‘‘బీఆర్ఎస్ నేతలకు నీతి, నిజాయితీ ఉంటే ఆ అనుమతులు తామే ఇచ్చినట్లు ఒప్పుకోవాలి. కేసీఆర్ సంతకాలతో ఉన్న ఆధారాలు అన్ని త్వరలోనే బయటపెడ్తం. ఈ కంపెనీ వివాదంపై అసెంబ్లీలో చర్చ పెడ్తం. స్పీకర్ కు అన్ని ఆధారాలు సమర్పించి చర్చకు అనుమతి కోరుతం” అని పేర్కొన్నారు.  తప్పుడు ప్రచారాలతో బీఆర్ఎస్ మనుగడ సాధించలేదన్నారు. 

యూట్యూబ్ చానళ్లలో తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలకు వాస్తవాలు తెలియకుండా పోవని తెలిపారు. ఇథనాల్​ ఫ్యాక్టరీ విషయంలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తాము  ధర్నాలు చేశామని ఆమె గుర్తు చేశారు. ‘‘ఆనాడు ఐటీ మంత్రిగా కేటీఆర్ ఉండి,  గ్రామ సభ పెట్టకుండా ఆ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిండు. గ్రామసభ పెట్టకుండా పర్మిషన్  ఎట్ల ఇస్తరు? ఇథనాల్ ఫ్యాక్టరీకి నాడు బీఆర్ఎస్ పర్మిషన్ ఇస్తే, బీజేపీ మద్దతు తెలిపింది” అని పేర్కొన్నారు. ఇథనాల్ కంపెనీ డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి, తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ కొడుకు ఉన్నారని తెలిపారు. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్పూర్ రావాలని, తాను కూడా అక్కడికి వస్తానని, ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలుద్దామని సీతక్క సవాల్ విసిరారు. తాము ఎక్కడ కంపెనీలు పెట్టినా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.