- రాడార్ ప్రాజెక్టు జీవో బీఆర్ఎస్
- హయాంలోనే ఇచ్చారు: సీతక్క
హైదరాబాద్, వెలుగు: దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టుకు అనుమతిస్తూ జీవో ఇచ్చింది గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే అని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు కేటీఆర్ మరికొందరు దానికి వ్యతిరేకంగా మాట్లాడడంపై ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకతీరు.. ప్రతిపక్షంలో ఉంటే ఇంకోతీరా అని మండిపడ్డారు.
మంగళవారం గాంధీ భవన్లో జరిగిన ‘మంత్రుల ముఖాముఖి’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాడార్ సెంటర్ ఏర్పాటుపై బీఆర్ఎస్ ఇప్పుడు మాట మార్చడం ఏమిటని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్.. బీజేపీ ఒక్కటేననే బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని ఖండించారు. బీజేపీది గాడ్సే సిద్ధాంతం అని, కాంగ్రెస్‌ది గాంధీ సిద్ధాంతం అని.. అందుకే ఈ రెండు పార్టీలు కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గాంధీభవన్‌లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్కకు భూమికి సంబంధించిన సమస్యలు, దివ్యాంగుల పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఉద్యోగం వంటి సమస్యలతో పాటు 1998 డీఎస్సీ అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలు కల్పించాలని, ఉపాధి హామీ సిబ్బంది తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్జీలు అందాయి. మొత్తం 160 అర్జీలు రాగా అందులో కొన్నింటిపై మంత్రి అక్కడికక్కడే పరిష్కారం కోసం కృషి చేశారు.