మహారాష్ట్రలో ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : మంత్రి సీతక్క

మహారాష్ట్రలో ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : మంత్రి సీతక్క
  •     ఈసారి కాంగ్రెస్​ కూటమిదే విజయం: మంత్రి సీతక్క
  •     సక్రి, నవపూర్​నియోజకవర్గాల్లో ప్రచారం

హైదరాబాద్, వెలుగు : మహారాష్ట్రలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మంత్రి సీతక్క అన్నారు. ఈ దఫా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర మహారాష్ట్ర ఎన్నికల సీనియర్ అబ్జర్వర్ అయిన సీతక్క.. బుధవారం సక్రి, నవపూర్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ముందుగా సక్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ప్రచార తీరు, ప్రజల స్పందనను సీతక్కకు ఆయన వివరించారు. అనంతరం ప్రచార సరళ, వ్యూహాలపై చర్చించారు. ఆ తర్వాత నవపూర్  నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శిరీశ్ కుమార్ నాయక్ తరఫున ప్రచారం చేశారు. ప్రచారం అనంతరం పార్టీ అభ్యర్థి, నేతలతో సమావేశమై నియోజకవర్గంలో పార్టీ ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో వేగం పెంచేలా కీలక సూచనలు చేశారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు 20 రోజులపాటు కష్టపడితే మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం తథ్యమని చెప్పారు.   

రాష్ట్ర ప్రజలకు మంత్రి దీపావళి శుభాకాంక్షలు.. 

రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అసమానతల చీకట్లను పారదోలి తోటి వారి జీవితాల్లో వెలుగులు పంచేలా దివ్వెల పండుగ జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో నియంతృత్వ చీకట్లను తరిమి ప్రజాస్వామ్య వెలుగులు పూయించిన ప్రజలకు సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టుగానే.. ఒకరికొకరు చేయూతగా నిలిచి తెలంగాణ ప్రగతికి పాటు పడాలని పిలుపునిచ్చారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు.