వెంకటాపూర్ (రామప్ప)/ములుగు (గోవింద రావుపేట)/తాడ్వాయి, వెలుగు : డిసెంబర్ 9 లోపు రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లాలోని అన్ని గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో సీసీ, బీటీ రోడ్ల రిపేర్లకు సోమవారం కలెక్టర్ దివాకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకటాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని స్టూడెంట్లు అందిపుచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో స్కూళ్లు, హాస్పిటల్స్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడంతో కంటెయినర్ స్కూల్, హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
ములుగు నియోజకవర్గం 75 శాతం అటవీ ప్రాంతంతో ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. అనంతరం గోవిందరావుపేట మండలంలో 13 మందికి, తాడ్వాయి మండలంలో 35 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్‌కుమార్, డీఈవో జి.పాణిని, మౌరిటెక్ ఐటీ ప్రతినిధులు నందమోహన్, మనోజ్‌కుమార్, హెచ్‌ఎం రాధిక, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు ఫరీదా బేగం పాల్గొన్నారు.