- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనుల పురోగతిపై ఆరా
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరలో క్లియర్చేస్తామ మంత్రి సీతక్క తెలిపారు. అభివృద్ధి పనుల్లో అధికారులు వేగం పెంచాలని ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫి ఉల్లా, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌తో కలిసి మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల్లో విభాగాల వారీగా జరుగుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శాఖల వారీగా నూతన పనులకు కార్యాచరణ రూపొందించి ప్రారంభించాలని కోరారు. హెచ్ఓడీలతో సమీక్ష అనంతరం డీఆర్ డీఓ, అడిషనల్ డీఆర్డీఓ, డీపీఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామాల్లో పచ్చదనం, స్వచ్ఛదనం కార్యక్రమానికి కొనసాగింపుగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. రాబోయే పది రోజుల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని యజ్ఞంలా కొనసాగించాలని, ప్రజలతోపాటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పెంచాలని కోరారు. జిల్లాల్లో ప్రతిరోజూ చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఆన్ లైన్ లో ఎంట్రీ చేయాలని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛతా హీ సేవా విభాగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని ఆదేశించారు. .
మంచినీటి సహాయకులకు శిక్షణ..
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో సరికొత్త ఒరవడికి నాంది పలికిందని, ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో మంచినీటి సహాయకులను నియమించి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. 15 జిల్లాల్లో 60 ప్రాంతాల్లో శిక్షణ కొనసాగుతుందని, ఈ నెలాఖరులోపు అన్ని గ్రామాలకు సహాయకులను నియమించి శిక్షణ పూర్తి చేస్తామన్నారు. తాగునీటి నాణ్యతతోపాటు, బోర్లు పాడైతే అదే రోజు మరమ్మతులు చేసేలా, పైపులు లీకైతే సరిచేసేలా గ్రామాల్లో మంచినీటి సహాయకులు కృషి చేస్తారని పేర్కొన్నారు.