మహిళా సాధికారతే థీమ్ తో విజయోత్సవ సభ : మంత్రి సీతక్క

  • ప్రజాపాలన విజయోత్సవ సభలో కొత్త స్కీంలు: సీతక్క

హైదరాబాద్, వెలుగు:  మహిళా సాధికారత థీమ్ తో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం సెక్రటేరియెట్ లోని తన ఆఫీసులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డీఎస్​లోకేశ్​కుమార్, సెర్ప్​సీఈవో దివ్య దేవరాజన్​, మహిళా, శిశు సంక్షేమ కార్యదర్శి అనితారాంచంద్రన్, డైరెక్టర్ కాంతివెస్లీతో కలిసి నూతన పథకాల గైడ్ లైన్స్, విజయోత్సవ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే స్టాళ్లపై మంత్రి చర్చించారు. విజయోత్సవ సంబరాలకు ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈ నెల19న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ స‌భ‌ మ‌హిళా సాధికారత‌కు మ‌రింత ఊత‌ం ఇస్తుందన్నారు. విజ‌యోత్సవ స‌భ‌ వేదికగా మ‌హిళా సాధికార‌త‌కు కొత్త ప‌థ‌కాలు ప్రకటించనున్నట్లు తెలిపారు.

 జిల్లా కేంద్రాల్లో ట్రాన్స్ జెండ‌ర్ల కోసం ప్రత్యేక క్లినిక్ లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 22 జిల్లాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి భ‌వ‌నాల నిర్మాణానికి సీఎం శంకుస్థాప‌న‌ చేస్తారన్నారు. దేశచరిత్రలోనే తొలిసారిగా మ‌హిళా సంఘాల‌కు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించినట్లు చెప్పారు. మ‌హిళా సంఘాల సభ్యుల‌కు బీమా సౌక‌ర్యం కల్పించామని, గ్రామీణ మ‌హిళ‌ల‌ను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా కార్యాచ‌ర‌ణ‌ రూపొందించామన్నారు. కోటిమంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వరులను చేయడమే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కాగా, ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా అన్ని మండలాల్లో సోమవారం మండల సమాఖ్యల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.