గుర్రంపేట జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులుండొద్దు : సీతక్క

  • పంచాయతీరాజ్‌‌ శాఖ మంత్రి సీతక్క        
  • గుర్రంపేటలో సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు

మొగుళ్లపల్లి, వెలుగు : జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. భూపాలపల్లి కలెక్టర్‌‌ భవేశ్‌‌ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీతో కలిసి ములుగు నియోజకవర్గ పరిధిలోని గుర్రంపేటలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సమక్క, సారలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ గుర్రంపేట మినీ మేడారం జాతర నిర్వహణకు రూ. 15 లక్షలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. జాతర ప్రదేశానికి వచ్చే రోడ్లపై గుంతలను పూడ్చి వేయాలని, అవసరమైన చోట రిపేర్లు చేయాలని సూచించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ ఆలయాలను సందర్శించి అభివృద్ధి నిధుల కోసం ప్రపోజల్స్‌‌ పంపనున్నట్లు చెప్పారు.

ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ములుగు, వెలుగు : ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ములుగు గ్రామపంచాయతీ పాలకమండలి ఆధ్వర్యంలో గురువారం ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు ఏరియాలోని ప్రతి కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ప్రతి గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అందరూ సహకరించాలని కోరారు. ములుగులో మోడల్‌‌ మార్కెట్‌‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని, శిథిలావస్థలో ఉన్న బస్టాండ్‌‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ శ్రీజ, సీఈవో ప్రసూణరాణి, డీపీవో వెంకయ్య, డీఎల్‌‌పీవో స్వరూపారాణి, సర్పంచ్‌‌ బండారి నిర్మల పాల్గొన్నారు.

బాలవికాస సేవలు అభినందనీయం

హనుమకొండ/కాజీపేట, వెలుగు : ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న బాల వికాస సేవలు అభినందనీయం అని మంత్రి సీతక్క కొనియాడారు. ప్రభుత్వాల కంటే ముందు శుద్ధి చేసిన మంచి నీటి వ్యవస్థను పరిచయం చేసిందే బాల వికాస సంస్థ అని గుర్తు చేశారు. హనుమకొండ ఫాతిమా నగర్‌‌లోని బాలవికాసలో గురువారం నిర్వహించిన వార్షిక మహాసభకు మంత్రి హాజరై మాట్లాడారు. తాగునీటి పథకాల నిర్వహణ, సరఫరాలో సర్పంచ్‌‌లను భాగస్వాములను చేసేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

ప్రజలకు ఎలాంటి స్కీమ్స్‌‌ అవసరమో గుర్తించి రిపోర్ట్‌‌ ఇస్తే వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తామనన్నారు. అనంతరం బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న నీటి శుద్ధి కేంద్రాలకు ఉచిత విద్యుత్‌‌ సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌‌ సింగారెడ్డి శౌరిరెడ్డి కోరగా ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అంతకుముందు మంత్రి సీతక్కను బాలవికాస వ్యవస్థాపకురాలు బాల థెరిసా, డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో ఇండియన్‌‌ ఇన్స్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్​కెమికల్‌‌ టెక్నాలజీ చీఫ్‌‌ ఇంజినీర్‌‌ డాక్టర్‌‌ శ్రీధర్‌‌, రెడ్కో వరంగల్​మేనేజర్‌‌ మహేందర్‌‌రెడ్డి, బాల వికాస ఫెడరేషన్‌‌ డైరెక్టర్​కేడం లింగమూర్తి పాల్గొన్నారు.