ఢిల్లీలో గెలిపిద్దాం.. గల్లీలో గెలుద్దాం : మంత్రి సీతక్క

ఢిల్లీలో గెలిపిద్దాం.. గల్లీలో గెలుద్దాం : మంత్రి సీతక్క
  • రాహుల్​గాంధీని ప్రధానిని చేద్దాం: మంత్రి సీతక్క
  • ఒక్క నెల గట్టిగా కష్టపడాలని కార్యకర్తలకు పిలుపు

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో కాంగ్రెస్​ను గెలిపిద్దామని, ఆ  తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ జెండా ఎగురవేద్దామని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్ పార్టీలు కూడబలుక్కుని కాంగ్రెస్‌‌ను అంతం చేయాలని కలలు కన్నాయని, కానీ, ఆ కలలను బద్ధలు కొడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌‌ను గెలిపించారని తెలిపారు. దేశంలోనూ కాంగ్రెస్‌‌ను గెలిపించి రాహుల్‌‌గాంధీని ప్రధానిని చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగి 34 ఏండ్లు అవుతున్నదని, నాటి నుంచి నేటి వరకూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఒక్క పదవిని కూడా తీసుకోలేదని సీతక్క గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించి, రాహుల్‌‌ను ప్రధానిని చేద్దాం అని పిలుపునిచ్చారు. ఒక్క నెల రోజులు గట్టిగా కష్టపడాలని ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. ఢిల్లీ ఎన్నికల తర్వాత గల్లీ ఎన్నికలు(స్థానిక సంస్థల ఎన్నికలు) జరుగుతాయని, అప్పుడు కాంగ్రెస్ శ్రేణులను గెలిపించేందుకు తాము కష్టపడుతామని మాట ఇచ్చారు. ఐదేండ్లు కష్టపడి ప్రజలను కాపాడుకుంటామని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్న మోదీ, ఉద్యోగాల గురించి అడిగితే అయోధ్యను చూపిస్తున్నారని దుయ్యబట్టారు.

‘‘ఉద్యోగాలు అడిగితే అయోధ్యను చూపిస్తున్నరు. అభివృద్ధి గురించి అడిగితే అక్షింతలు పంపిస్తున్నరు. జన్​ధన్ ఖాతాలు తెరిపించారు.. కనీసం ఒక్క రూపాయి కూడా ఆ ఖాతాల్లో వేయలేదు. రైతులను ముంచడానికి నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది” అని ఆమె దుయ్యబట్టారు.  ప్రజల నమ్మకం కోల్పోయి  ప్రతిపక్షంలో కూర్చున్న కేసీఆర్, నోటికొచ్చినట్టు మాట్లాడి మరింత దిగజారుతున్నారని సీతక్క విమర్శించారు.