- ఇక్కడికి రాగానే ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : ములుగు గడ్డ మీద అడుగుపెట్టగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని, ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. మంత్రిగా చార్జ్ తీసుకున్న అనంతరం ఆదివారం మొదటిసారిగా ములుగు వచ్చిన సీతక్కకు మహ్మద్ గౌస్‌పల్లి వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
గట్టమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ మాట ఇస్తే తప్పేది కాదని, సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.
మేడారం జాతరకు తక్కువ నిధులు కేటాయించారని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ. 75 కోట్లు మంజూరు చేశామన్నారు. మరిన్ని నిధులు కేటాయించి జాతరను సక్సెస్ చేస్తామని చెప్పారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తానని సమ్మక్క, సారలమ్మ, రామప్ప రామలింగేశ్వర స్వామి, మల్లూరు నరసింహస్వామి ఆశీస్సులతో పనిచేస్తానని చెప్పారు.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను ఆదరించి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో సీఎం రేవంత్‌రెడ్డి మంచి శాఖలు అప్పగించారన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి పనిచేస్తానన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, ప్రజల అవసరాలు గుర్తించి వాటిని తీరుస్తామని హామీ ఇచ్చారు.