హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీలకు సప్లై చేసే బాలామృతం క్వాలిటీగా లేనట్లు తనకు ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని మహిళ స్ర్తీ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులపై మండిపడ్డారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా మారకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. టెండర్లు పిలవకుండా నామినేషన్ పై పనులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. టీజీ ఫుడ్స్ లో అన్ని నిర్ణయాలు రాతపూర్వకంగా ఉండాలని అంతే తప్ప మౌఖిక ఆదేశాలు ఒప్పుకోమని స్పష్టం చేశారు.
గురువారం సెక్రటేరియెట్ లో టీజీ ఫుడ్స్ పై కార్పొరేషన్ చైర్మన్ ఎంఎ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీలతో కలిసి మంత్రి సీతక్క రివ్యూ చేశారు. కారుణ్య నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన జరగడంపై మంత్రి సీరియస్ అయ్యారు. ఈ ఘటనల వెనుక టీజీ ఫుడ్స్ లో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందని మంత్రికి ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నారు.