
నిర్మల్/ఖానాపూర్, వెలుగు: బీజేపీ దేవుళ్ల పేరిట రాజకీయం చేస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. ప్రశ్నించే నేతలందరిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఖానాపూర్, నిర్మల్‌లో శనివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 50 వేల మెజార్టీ సాధించేలా కృషి చేయాలని చెప్పారు. భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశమంతా పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారన్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకే చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. అవినీతి, ఆరోపణలు ఉన్న వారిని దూరంగా పెడుతామన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్, నాయకులు అర్జుమన్, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సత్యం పాల్గొన్నారు.
అలేఖ్య ఫ్యామిలీకి అండగా ఉంటాం
ఖానాపూర్ పట్టణంలో గత నెల 8న హత్యకు గురైన శెట్‌పల్లి అలేఖ్య ఫ్యామిలీకి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావుతో కలిసి శనివారం ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌లో అలేఖ్య ఫ్యామిలీ మెంబర్స్‌ను పరామర్శించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు విషయాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వపరంగా ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. అనంతరం అలేఖ్య ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి వెంట రాజురా సత్యం, కావాలి సంతు, దొనికేని దయానంద్, షబ్బీర్ పాషా, నిమ్మల రమేశ్, విజయలక్ష్మి ఉన్నారు. అలాగే నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పసుపుల శివారులో ఉన్న పసుపుల బ్రిడ్జిను మంత్రి పరిశీలించారు.