పదేండ్లు రేషన్​ కార్డులివ్వకుండా.. ఇప్పుడు గ్రామాల్లో లొల్లులు పెడ్తరా?

పదేండ్లు రేషన్​ కార్డులివ్వకుండా..  ఇప్పుడు గ్రామాల్లో లొల్లులు పెడ్తరా?
  • చిట్​చాట్​లో బీఆర్​ఎస్​పై మంత్రి సీతక్క ఫైర్​
  • మీ పాలన బాగుంటే ఇన్ని అప్లికేష్లన్లు ఎందుకొస్తున్నయ్​
  • గతంలో ఎమ్మెల్యే చెప్పినోళ్లకే స్కీములు.. ఇప్పుడు గ్రామ సభల్లో ఎంపిక
  • 96 శాతం సభలు సక్సెస్..  అర్హులందరికీ స్కీములు ఇస్తమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ను కేబినెట్ లో ఆమోదిస్తామని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలో సర్పంచ్​ ఎన్నికలు నిర్వహిస్తామని, సర్పంచ్ లు లేకపోవడంతో  నిధులు ఆగిపోయాయని, పాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. బుధవారం సెక్రటేరియెట్​లోని తన ఛాంబర్ లో మీడియాతో మంత్రి చిట్ చాట్ చేశారు. అన్ని పథకాలకు గ్రామ సభల్లో పారదర్శకంగా అర్హుల ఎంపిక జరుగుతున్నదన్నారు. పందేండ్ల తర్వాత గ్రామాల్లో సభలు జరుగుతున్నాయని, ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

 బీఆర్​ఎస్​ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినోళ్లకే స్కీమ్ లు వచ్చాయని, ఫాంహౌజ్ లో, ఎమ్మెల్యేల ఇండ్లలో లబ్ధిదారుల ఎంపిక జరిగేదన్నారు. రాష్ర్టవ్యాప్తంగా మంగళవారం 3,410 గ్రామాల్లో సభలు జరిగితే కేవలం 142 గ్రామాల్లోనే లొల్లులు జరిగాయన్నారు. 96 శాతం గ్రామ సభలు సక్సెస్ అయ్యాయన్నారు. పదేండ్లు రేషన్ కార్డులివ్వలేదని, ఇప్పుడు గ్రామ సభలకు వచ్చి జనాన్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేవలం ఎన్నికల సమయంలోనే స్కీమ్​లు తీసుకొచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్​ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు ప్రకారం పథకాలు అమలు చేస్తున్నదన్నారు.

కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు కులగణన సర్వేలో పాల్గొనలేదు. వాళ్లలో ఇప్పుడు పథకాలు రావనే ఆందోళన ఉంది. అప్లికేషన్లు తీసుకోవడం అనేది నిరంతర పక్రియ. ఎవరూ ఆందోళన చెందొద్దు. ఏ ఒక్క అర్హుడూ నష్టపోడు. బీఆర్ ఎస్  చేతకానితనం వల్లే ఇన్ని సమస్యలు. ఆ పదేండ్ల పాలన బాగుంటే ప్రజాపాలనలో లక్షల అప్లికేషన్లు ఎందుకొచ్చాయి. వందల ఎకరాలున్న భూస్వాములకు రైతుబంధు ఇచ్చారు. కానీ లెక్కల కష్టాన్ని నమ్ముకున్న కూలీలను ఆదుకోలేదు. వారికి కాంగ్రెస్​ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నది.’ అని మంత్రి అన్నారు. 

దివ్యాంగుల పెన్షన్ రికవరీ నిలుపుదల

తెలంగాణ దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ను మంత్రి సీతక్క సెక్రటేరియెట్​లో ఆవిష్కరించారు. దివ్యాంగ ఉద్యోగుల నుంచి పెన్షన్ రికవరీని ఆపాలని మంత్రి సీతక్కను దివ్యాంగులు కోరారు. వెంటనే ఆమె సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్​కు ఫోన్​ చేసి.. పెన్షన్ రికవరీని ఆపాలని ఆదేశించారు.  తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్- మహిళా, శిశు సంక్షేమ శాఖ క్యాలెండర్ ను కూడా మంత్రి ఆవిష్కరించారు.