బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలకు  నిలువెల్లా అహంకారమే : మంత్రి సీతక్క

బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలకు  నిలువెల్లా అహంకారమే : మంత్రి సీతక్క
  • వారి నుంచి హుందాతనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు: సీతక్క
  • గత ప్రభుత్వ పాలనలో గురుకులాల్లో 70 ఘటనలు జరిగినయ్
  • 5,197 కోట్ల ఫీజు బ‌‌కాయిలు పేరుకుపోయాయి
  • మిషన్ భగీరథకు ముందు ప్రజలు నీళ్లే తాగలేదన్నట్టు మాట్లాడుతున్నరని ఫైర్
  • మండలిలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రులు దీటైన రిప్లై

హైదరాబాద్‌‌, వెలుగు: గుమ్మడికాయల దొంగలు ఎవరంటే బీఆర్ఎస్ వాళ్లు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే తమకు తెలుసని.. బీఆర్‌‌‌‌ఎస్‌‌ వాళ్లలా యాక్టింగ్ రాదని అన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ వాళ్లు మాట్లాడితే నిలువెల్లా అహంకారమే ఉంటుందని.. వారి నుంచి హుందాతనం నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని ధ్వజమెత్తారు. మూసీ పునరుజ్జీవం, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌, గురుకులాల్లో వసతులు, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాలపై మండలిలో మంగళవారం వాడివేడి చర్చ జరిగింది.

ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్సీలు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు సీతక్క, శ్రీధర్‌‌‌‌ బాబు దీటైన సమధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. నిరుద్యోగులు చనిపోతే తల్లిదండ్రులకు శవాలను కూడా చూపించలేదని మండిపడ్డారు. ఒక్కరి ఇంటికైనా పోయి పరామర్శించారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 2016 నుంచి గతేడాది వరకు ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ బకాయిలు పేరుకుపోయాయని మంత్రి సీతక్క తెలిపారు. గ‌‌త ఐదేండ్లలోనే రూ.5,197 కోట్ల ఫీజు బ‌‌కాయిలున్నాయన్నారు.

 ఫీజు చెల్లించ‌‌క‌‌పోవ‌‌డంతో కాలేజీ యాజ‌‌మాన్యం ఇంటికి పంపిస్తే.. అవ‌‌మాన భారంతో వ‌‌న‌‌ప‌‌ర్తి జిల్లాలో లావ‌‌ణ్య అనే ద‌‌ళిత ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని గుర్తుచేశారు. బకాయిలను పూర్తి చేసేందుకు తాము చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో గురుకులాల్లో 70 ఘటనలు జరిగాయని.. 5,024 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వివరించారు.

వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజను బతికించేందుకు ఎంతో కృషి చేశామని, మంత్రులు, సీఎంవో సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారని తెలిపారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన అధికారి.. పదవికి రాజీనామా చేశాక ఎన్నో ట్వీట్స్ చేశారని విమర్శించారు. ప్రస్తుతం గురుకులాల్లో జరుగుతున్న ఘటనలపై అనుమానాలు ఉన్నాయని, అన్ని విషయాలను బయటకు తీస్తామని పేర్కొన్నారు. 16  ఏండ్ల తరువాత కాస్మొటిక్‌‌ చార్జీలు, ఏడేండ్ల తరువాత డైట్‌‌ చార్జీలను పెంచామని మంత్రి వివరించారు.

మిషన్ భగీరథకు ముందు ప్రజలు నీళ్లుతాగలేదా? 

మిషన్ భగీరథ ఏర్పాటు తర్వాతే రాష్ట్రంలో ప్రజలు నీళ్లు తాగుతున్నట్టు.. అంతకు ముందు నీళ్లే తాగలేదన్నట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క చురకలంటించారు. రవీందర్ రావు ఇంతకాలం ఏ నీళ్లు తాగి పెరిగారు? అని ప్రశ్నించారు. గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థ ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. మిషన్ భగీరథలో చాలా గ్యాప్స్ గుర్తించామని, పల్లెలకు, తండాలకు భగీరథ నీళ్లు అందట్లేదన్నారు. తమ సర్కారు ఏర్పాటయ్యాక ఇంటింటి సర్వేచేసి.. 3.21 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు.  

అప్పుడు మేనిఫెస్టోలో పెట్టి.. ఇప్పుడు విమర్శలా?: శ్రీధర్‌‌‌‌బాబు

మూసీ ప్రక్షాళన చేస్తామని 2016 మేనిఫెస్టోలో పెట్టిన గత ప్రభుత్వం.. ఇచ్చిన మాటను మర్చిపోయిందని మంత్రి శ్రీధర్​బాబు విమర్శించారు. గతంలో బఫర్ జోన్ పరిధి 30 మీటర్లు ఉంటే.. గత ప్రభుత్వం 50 మీటర్లకు పెంచిందని గుర్తుచేశారు. బఫర్‌‌‌‌జోన్‌‌లో మార్కింగ్ జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు రివర్‌‌ ‌‌బెడ్‌‌లో 2,116 ఇండ్లు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.

ఇందులో ఇండ్లు కోల్పోతున్న 309 మందికి ఇండ్లు ఇస్తున్నామని, 2.40 లక్షల నష్టపరిహారం ఇచ్చామని తెలిపారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో పట్టాలు ఉంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తామని వెల్లడించారు. మూసీ ప్రక్షాళనను ఆ నాడు మేనిఫెస్టోలో పెట్టిన ఆ పార్టీ సభ్యులు.. ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.