హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పునర్విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఏపీకి నిధులు కేటాయించిన కేంద్రం.. తెలంగాణను మర్చిపోయిందన్నారు. 77 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలంగాణ పదం లేకపోవడం వివక్షకు అద్దం పడుతున్నదన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని.. ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు.
ఇక్కడి నుంచి పన్నుల రూపంలో రూపాయి వెళితే.. 42 పైసలే తిరిగి వస్తున్నాయన్నారు. అలాంటప్పుడు ప్రత్యేక నిధులు ఎందుకు కేటాయించరని సీతక్క ప్రశ్నించారు. తెలంగాణలో 1,059 హాబిటేషన్స్ లో మిషన్ భగీరథ వ్యవస్థ ఏర్పాటు కాకున్నా.. వంద శాతం పూర్తి చేసినట్లు గత ప్రభుత్వం తప్పుడు నివేదికలు సమర్పించడంతో గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయిందన్నారు.