ప్రియాంక కాలి గోటికి కవిత సరిపోదు: సీతక్క

ప్రియాంక గాంధీని అడ్డుకుంటామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  కవిత ప్రియాంక  కాలి గోటికి కూడా సరిపోదని మండిపడ్డారు. ఇంద్రవెల్లి సభ చూసిన బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అక్కసు వెళ్ల గక్కుతున్నారని విమర్శించారు. ప్రియాంకది త్యాగాల కుటుంబం అయితే.. కవితది అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవిస్తున్న కుటుంబమని ధ్వజమెత్తారు.

ఇంద్రవెళ్లి సభ పార్టీ నిధులతో నిర్వహించాం..బీఆర్ఎస్ లా ప్రజాధనం దుర్వియోగం చేయడం లేదని చెప్పారు సీతక్క. కేసీఆర్ కుటుంబం  తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ల ఎస్టేట్ గా భావించి దోచుకున్నారని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. పదే పదే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్న  బీఆర్ఎస్ కు ఎందుకంత అక్కసని ప్రశ్నించారు.  మాజీ సీఎస్ సోమేష్ కుమార్   సాగు చేయని భూమికి  రూ.14 లక్షల రైతుబంధు తీసుకున్నారు.. ఇలా కోట్లాది రూపాయల రైతుబంధు మింగిన వారెవరో కక్కిస్తామన్నారు. అసలైతన రైతులకు రైతుబంధు ఇస్తామని చెప్పారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత ఇంద్రవెల్లి సభ కోసం  కాంగ్రెస్ ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగించారని కవిత ప్రశ్నించారు.  ఏ హోదాలేని  ప్రియాంక గాంధీని ప్రభుత్వ కార్యక్రమాలకు  ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.  ప్రియాంక గాంధీని   పిలిస్తే నిరసన తెలుపుతామని హెచ్చరించారు.