రాహుల్ కులం త్యాగం.. మతం మానవత్వం : మంత్రి సీతక్క

రాహుల్ కులం త్యాగం.. మతం మానవత్వం : మంత్రి సీతక్క
  • ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపించాలి 
  • ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి పిలుపు

ఆదిలాబాద్/ నిర్మల్-/ భైంసా, వెలుగు:  దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన నెహ్రూ కుటుంబం నుంచి వ‌‌‌‌చ్చిన నాయ‌‌‌‌కుడు రాహుల్ గాంధీ అని, ఆయనది త్యాగాల కులమని, మానవత్వం మతం అని మంత్రి  సీతక్క పేర్కొన్నారు.  మోదీ ప్రభుత్వం అభివృద్ధి మరిచిపోయి మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డికి ఒక్క చాన్స్ ఇవ్వాలని మంత్రి కోరారు.  

ఆదివారం  ఆదిలాబాద్, నిర్మల్, భైంసాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని మాట్లాడారు. నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో బీజేపీ రాజ‌‌‌‌కీయం చేస్తుంద‌‌‌‌న్నారు. ప్రధాని బీసీ కాద‌‌‌‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సబబేనని, మోదీ సీఎంగా ఉన్నప్పుడు బీసీలోకి మారారని గుర్తు చేశారు. 1931 తర్వాత కుల గణన చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 53 వేల ఉద్యోగాలు కల్పించామని, ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు చేశామన్నారు. ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్, రైల్వే మార్గం, కుప్టీ, ప్రాణహిత ప్రాజెక్టుల కోసం సీఎం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు.  

ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో 10 శాతం ఫ్రీ సీట్లు

ఎన్నో ఏండ్లుగా విద్యా సంస్థలు నడుపుతున్న తాను ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తన సంస్థల్లో 10 శాతం సీట్లు ఉచితంగా అందిస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తెలిపారు. పేదలకు 25 శాతం సబ్సీడీ ఫీజు అవకాశం కల్పిస్తామన్నారు.  లైబ్రరీలో కాంపిటేటివ్  ఎగ్జామ్స్ కు  ప్రిపేర‌‌‌‌య్యే అభ్యర్థులకు మ‌‌‌‌ధ్యాహ్న భోజ‌‌‌‌నం అందించే విధంగా సీఎంతో మాట్లాడతాన‌‌‌‌ని ఆయన హామీ ఇచ్చారు. 

ఆదిలాబాద్ లో యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుక కృషి చేస్తానని, అభివృద్ధి నిధులు తీసుకొస్తామనని పేర్కొన్నారు. మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల్ చారి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.