విద్యావ్యవస్థను నాశనం చేసిన బీఆర్ఎస్ పాలకులు

విద్యావ్యవస్థను నాశనం చేసిన బీఆర్ఎస్ పాలకులు
  • మారుమూల గ్రామాల్లో నాణ్యమైన విద్యకు రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి 
  • గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం
  • ములుగు జిల్లాలో కంటెయినర్ స్కూల్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క

ఏటూరునాగారం, వెలుగు: అడవుల్లో నివసించే గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి  సీతక్క పేర్కొన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలకులు విద్యావ్యవస్థను నాశనం చేశారని, వందలాది ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారని విమర్శించారు. మంగళవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారుపల్లిలో రూ. 13.50 లక్షలతో నిర్మించిన కంటెయినర్ స్కూల్ ను ప్రారంభించారు. మంత్రి బోర్డుపై ఏబీసీడీలు రాసి విద్యార్థులకు బోధించారు.

విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర అటవీశాఖ రూల్స్ అడ్డుగా ఉండడంతో ఏర్పాటు చేయలేకపోతున్నామ న్నారు.  సమస్యను ఎలాగైనా అధిగమించి..  గిరిజన బిడ్డలకు విద్యను అందించాలని లక్ష్యంతో కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

రాబోయే రోజుల్లో మరో రెండు మూడు చోట్ల ఇలాంటి స్కూళ్లను నిర్మిస్తామన్నారు.  ఎన్నికల హామీల మేరకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పథకాలు సైతం ప్రవేశపెట్టి లబ్ధిదారులకు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ దివాకర్, అధికారులు పాల్గొన్నారు.