జయశంకర్ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో గవర్నమెంట్ ఆఫీసర్లంతా కొంత ఉదాసీనంగా ఉండడం పరిపాటే. దీంతో మేడారం మహాజాతర నేపథ్యంలో ఆఫీసర్లను అలెర్ట్‌గా ఉంచడానికి మంత్రి సీతక్క గురువారం అర్ధరాత్రి మేడారంలో అకస్మికంగా పర్యటించారు. పొద్దంతా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని సాయంత్రం హైదరాబాద్ నుంచి నేరుగా మేడారం చేరుకున్నారు. రాత్రి 8.30 నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు అక్కడే ఉన్నారు. జాతర ఏర్పాట్లపై కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్‌లతో పాటు ఎండోమెంట్ ఆఫీసర్లతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం మహాజాతర కోసం రూ.105 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను, క్యూలైన్లను, ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా, టెంపుల్ సర్కిల్, గద్దెల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లైటింగ్‌ను పరిశీలించారు. గద్దెల చుట్టూ కలియ తిరిగారు. క్యూలైన్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, లైన్లలో సిమెంట్ కాంక్రీట్ వేయాలని, ఖరాబైన ఇనుప సలాకులు భక్తులకు గుచ్చుకోకుండా బాగుచేయాలని ఆదేశించారు. అక్కడే ఉన్న భక్తులతో మాట్లాడారు. గిరిజన పూజారులతో మాట్లాడి జాతర ఏర్పాట్లు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత సీతక్క మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21 నుంచే జాతర ప్రారంభమవుతున్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్లాన్చేస్తున్నామన్నారు. 23న జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం ఈవో రాజేంద్ర ఉన్నారు.