ఆపరేషన్​ కగార్​ను ఆపండి : మంత్రి సీతక్క

ఆపరేషన్​ కగార్​ను ఆపండి : మంత్రి సీతక్క
  • కేంద్రం తక్షణం మావోయిస్టులతో చర్చలు జరపాలి: మంత్రి సీతక్క 
  • ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి 
  • ఆదివాసీల హక్కులను కాలరాయొద్దని విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. మంగళవారం హైదరాబాద్​లోని  ప్రజా భవన్​లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేశ్​బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తనవంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. 

 తెలంగాణ, చత్తీస్ గఢ్​ సరిహద్దు కర్రెగుట్టల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని కోరారు.  వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని సీతక్కకు వివరించారు. ఆపరేషన్ కగార్​ను నిలిపివేయకపోతే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, దీన్ని నిలువరించేందుకు కృషి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ‘‘శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలి. తెలంగాణ, చత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. మధ్యభారతంలోని ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయి. 

అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలనా విధానాలు ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసీ బిడ్డగా కోరుకుంటున్నాను. ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దు..  ఆ జాతి బిడ్డగా ఆదివాసీలకు అండగా నిలుస్తాను.  ఆపరేషన్ కగార్ తో ఆదివాసీలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించాలి. రెండు వైపులా ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయి” అని మంత్రి పేర్కొన్నారు.