ఆఫీసర్లు వెనుకబడిన ప్రాంతాల్లోనూ పనిచేయాలి : మంత్రి సీతక్క

ఆఫీసర్లు వెనుకబడిన ప్రాంతాల్లోనూ పనిచేయాలి : మంత్రి సీతక్క
  • ఇక్కడ పని చేసేవాళ్లను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు వంటి ప్రాంతాల్లో పనిచేసేందుకు కొందరు ఆఫీసర్లు వెనుకడుగు వేస్తున్నారని, ఇలాంటి ధోరణి మంచిది కాదని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం అసిఫాబాద్‌‌‌‌ జిల్లాలో పర్యటించిన మంత్రి గుండి గ్రామంలో హైస్కూల్‌‌‌‌ను ప్రారంభించారు. జనకాపూర్‌‌‌‌ హైస్కూల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన సంచార సైన్స్‌ ల్యాబ్‌‌‌‌ను, కలెక్టరేట్‌‌‌‌లో, హాస్పిటల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌‌‌‌ను, మొబైల్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు ముందుకు రావాలని సూచించారు.

రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌లో డాక్టర్ల కొరత, కొత్తగా నియామకం అయిన నర్స్‌‌‌‌లకు జీతాలు అందని విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని మంత్రితో పాటు హెల్త్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మారుమూల జిల్లా అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీపై స్టూడెంట్లు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించిందన్నారు. అనంతరం 270 మహిళా సంఘాలకు రూ. 16 కోట్ల బ్యాంకు లోన్‌‌‌‌ చెక్కు, రూ. 2 కోట్ల స్త్రీనిధి లోన్‌‌‌‌ చెక్కును అందజేశారు. ఆమె వెంట కలెక్టర్‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌ ధోత్రే, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ దీపక్‌‌‌‌తివారి, సబ్‌‌‌‌ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎమ్మెల్సీ దండే విట్టల్, ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉన్నారు.