ఆదివాసీ మహిళల ఫొటో ఎగ్జిబిషన్ బాగున్నది: మంత్రి సీతక్క

ఆదివాసీ మహిళల ఫొటో ఎగ్జిబిషన్ బాగున్నది: మంత్రి సీతక్క
  • మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం

బషీర్​బాగ్, వెలుగు:  సమాజానికి దూరంగా.. మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ మహిళల జీవిత మూలాలను వెలికి  తీసి ఫొటో ఫ్రేమ్​లో బంధించడం గొప్ప విషయమని మంత్రి సీతక్క అన్నారు. రవీంద్రభారతిలో ఫొటోగ్రాఫర్ డీఎం అర్జున్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గిరిజన మహిళల పండుగల ఫొటో ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారభించారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడాన్ని మంత్రి అభినందించారు. 

శ్రామిక మహిళల హక్కుల కోసం ప్రారంభించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. నేడు ఎవరికి వారు అనుకూలంగా మార్చుకుంటున్నారని సీతక్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు 20 రకాల బిజినెస్ లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. రూ.21,500 కోట్ల వడ్డీ లేని రుణాలను మంజూరు చేసిందని వివరించారు.

బస్సుల్లో ఫ్రీగా ఎక్కించడమే కాకుండా వారిని బస్ ఓనర్లను చేశామని ఆమె అన్నారు. మహిళా సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు, పీవోడబ్ల్యూ సంధ్య పాల్గొన్నారు.