- బాబుకు అందుతున్న వైద్య సేవలపై ఆరా
సికింద్రాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పరామర్శించారు. మంగళవారం రాత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీతో కలిసి మంత్రి సీతక్క కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. శ్రీతేజ్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి దవాఖానలో బాబుకు అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు. అనంతరం శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఆమె కొడుకు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉండటం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీతేజ్ కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం తరఫున అన్ని సహాయ, సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. శ్రీతేజ్ ప్రాణాలను కాపాడేందుకు ఇటు ప్రభుత్వం.. అటు డాక్టర్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి శ్రీతేజ్ కు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నామని మం త్రి సీతక్క వెల్లడించారు.