
- స్కీముల విషయంలో మానవత్వంతో ఆలోచించండి
- పొరపాట్లు జరిగితే వెంటనే సరిదిద్దుకోవాలని అధికారులకు సూచన
- మంచిర్యాలలో ఓ వృద్ధురాలికి పింఛన్ ఆపడంపై ఆగ్రహం
- పీఆర్, ఆర్డీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ గ్రీవెన్స్ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుచేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సస్పెన్షన్తోపాటు సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తామని మంత్రి సీతక్క హెచ్చరించారు. కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని, స్కీముల అమలులో విచక్షణ, మానవత్వం మరవొద్దని సూచించారు. మంచిర్యాలలో ఓ వృద్ధురాలికి పింఛన్ ఆపడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం మీద రుద్దితే చర్యలు తప్పవని, పొరపాటు దొర్లితే సరిదిద్దుకోవాలన్నారు.
శుక్రవారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఆమె జూమ్ మీటింగ్ నిర్వహించారు. సెక్రటేరియెట్ నుంచి సమావేశానికి హాజరుకావాల్సి ఉండగా.. ములుగులో గవర్నర్ పర్యటన నేపథ్యంలో అక్కడికి వెళ్తూ ప్రయాణంలోనే ఉద్యోగులతో మాట్లాడారు. పీఆర్, ఆర్డీ శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆన్ లైన్ గ్రీవెన్స్ చేపట్టినట్టు చెప్పారు. ఇకపై వ్యక్తిగతంగా సచివాలయం చుట్టూ తిరగకుండానే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సిబ్బంది సర్వీస్ మ్యాటర్, సమస్యల ఫైల్స్ పెండింగ్ లో పెట్టొద్దని, ఫైల్స్ ను వెంటనే క్లియర్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఆన్ లైన్ గ్రీవెన్స్ లో మంత్రి దృష్టికి సమస్యలు..
- ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంపీడీఓలు, డీపీఓలు, ఇంజినీర్లు, డీఆర్డీఓలు సహా అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది వివిధ సమస్యలపై సెక్రటరీ లోకేశ్ కుమార్, డైరెక్టర్ సృజన, ఈఎన్సీలు కనకరత్నం, కృపాకర్ రెడ్డికి వినతిపత్రాలు ఇచ్చారు. ప్రమోషన్లు, బదిలీలు, జీవో 317 రద్దు, అడహక్ ప్రమోషన్లు, ఈజీఎస్ సిబ్బంది, మిషన్ భగీరథలో ఇంజినీర్లకు పీఆర్సీ పెండింగ్, మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లు, ఏసీబీ ట్రాప్ కేసులో సస్పెండ్ అయి రెండేళ్లు దాటిన వారికి పోస్టింగ్ ఇవ్వాలని కోరారు.
- గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని, స్పౌజ్ బదిలీలు, పీఆర్సీ పెంపు, ఎన్నికల ముందు ట్రాన్స్ ఫర్ అయిన ఎంపీడీవోలను పాత స్థానాలకు పంపాలని విన్నవించారు. వీటితోపాటు మరికొన్ని అంశాలనూ ఉద్యోగులు మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంపై ఉద్యోగులు, సిబ్బంది మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.