ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే మరోవైపు స్వయం ఉపాధి కల్పించాలనేది మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (మార్చి 17) ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి, ఎమ్మెల్యేలు కూనంనేని, అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. యువ వికాసం పథకం ఉపయోగించుకుని యువత ఉపాధి కల్పించుకోవాలని సూచించారు.

ఉద్యోగాలు లభించక గ్రామీణ యువత ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. వారికి ఉపాధి కల్పించేందుకు ఈ పథకం తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ పాలనలో యువతకు అండగా ఉంటామని పేర్కొన్నారు మంత్రి సీతక్క. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. యువత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే రాజీవ్ యువ వికాస పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఏంటీ..?

రాజీవ్ యువ వికాసం పథకం ఆన్‌‌‌‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియ సోమవారం (మార్చి 17) నుంచి ప్రారంభం అయ్యింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఎవరైనా ఏప్రిల్‌‌‌‌ 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్‌‌‌‌ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల వెరిఫికేషన్ కొనసాగుతుంది. అర్హులను ఎంపిక చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున (జూన్‌‌‌‌ 2) లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు.

ALSO READ | గుడ్ న్యూస్: నిరుద్యోగ యువతకు రూ.3 లక్షలు..రాజీవ్ యువ వికాసం షురూ

 ఈ పథకం కింద ఒక్కొక్కరు గరిష్టంగా రూ.3 లక్షల వరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు. ఈ పథకం కింద దాదాపు 5 లక్షల మందికి రూ.6 వేల కోట్లతో సబ్సిడీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేయనుంది. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు ఆయా కార్పొరేషన్ల వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఇప్పటికే వెల్లడించారు.