- బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
హైదరాబాద్, వెలుగు: చేసిన పనుల బిల్లులు చెల్లించకుండా సర్పంచులను రోడ్ల మీదకు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ పెద్దలే.. ఇప్పుడు ముందుండి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని సర్పంచులే స్వయంగా పనులు చేస్తే అప్పటి ప్రభుత్వ పాలకులు బిల్లులు చెల్లించకుండా వారిని అప్పుల పాల్జేసి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేసారని గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సర్పంచులకు చెల్లించాల్సిన దాదాపు రూ.
1,300 కోట్లను దారి మళ్లించి వాడుకున్న వారే ఇప్పుడు దొంగ సానుభూతి కనబరుస్తున్న విషయం అందరికీ తెలుసుని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులన్ని పెండింగులో పెట్టి.. ఆ భారం తమ ప్రభుత్వంపై వేసి ఇప్పుడు దొంగే దొంగ అని అరిచినట్టుగా గోల చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పెండింగు బిల్లులతో వడ్డీలు పెరిగి అప్పులు తీర్చే మార్గం లేక 60 మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడింది నిజం కాదా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ అంత అవకాశవాద పార్టీ ఇంకోటి ఉండదని పేర్కొన్నారు. సర్పంచులకు రావాల్సిన బకాయిలను చెల్లిస్తామని, దశల వారీగా నిధులను విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మి మాజీ సర్పంచులు ఎవరూ ధర్నాలు, ఆందోళనలు చేయవద్దని శ్రీధర్ బాబు తెలిపారు.