ధర్మారం, వెలుగు: పత్తిపాక రిజర్వాయర్‌తో ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వవచ్చని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామం వద్ద నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ స్థలాన్ని ఆదివారం విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణరావు, రాజ్ ఠాకూర్ తో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇక్కడి రైతంగాన్ని మోసం చేశాడని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడంతో పత్తిపాక రిజర్వాయర్ ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేసి, ఇక్కడి రైతుల మద్దతుతో ప్రాజెక్టు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణు, ఎస్సారెస్పీ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ ఆరీఫోద్దీన్ పాల్గొన్నారు.