టీజీటీఎస్​ వ్యాపార పరిధిని పెంచాలి .. అధికారులకు మంత్రి శ్రీధర్​ బాబు సూచన

టీజీటీఎస్​ వ్యాపార పరిధిని పెంచాలి .. అధికారులకు మంత్రి శ్రీధర్​ బాబు సూచన

హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు : ప్రభుత్వ శాఖలకు కంప్యూటర్​ హార్డ్​వేర్, సాఫ్ట్​వేర్​ను సరఫరా చేసే నోడల్​ ఏజెన్సీ తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్​ (టీజీటీఎస్) వ్యాపార పరిధిని పెంచాలని అధికారులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు సూచించారు. నిరుడు సంస్థకు రూ.5 కోట్ల  లాభం వచ్చిందని, ఇప్పుడు కార్యకలాపాలను పెంచుకోవడం ద్వారా టర్నోవర్​ను మరింత పెంచుకోవాలన్నారు. టీజీటీఎస్​ పనితీరుపై సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష చేశారు. ప్రభుత్వ విభాగాలన్నీ టీజీటీఎస్  ద్వారానే కంప్యూటర్​ పరికరాలు, సాఫ్ట్​వేర్​లను సమకూర్చుకునేలా ఐటీ సెక్రటరీ జయేశ్​ రంజన్​తో చర్చించాలన్నారు. 

ప్రస్తుతం 44 ప్రభుత్వ విభాగాలు, 140 ఇతర డిపార్ట్​మెంట్లకు టీజీటీఎస్​ సేవలు అందిస్తున్నదని సంస్థ ఎండీ శంకరయ్య మంత్రికి తెలిపారు. కొన్ని ఒప్పందాల్లోనే సొంతంగా కొనుగోళ్లు జరుపుతామని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి.. కొద్ది మొత్తంలో కొనుగోళ్ల కంటే భారీ ఆర్డర్ల ద్వారా రాయితీలు, తక్కువ ధరకే ఎలక్ట్రానిక్  పరికరాలు సేకరించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీజీటీఎస్​ చైర్మన్​ మన్నె సతీశ్​ కుమార్​తో కలిసి మంత్రి శ్రీధర్​ బాబు ఉద్యోగులతో ఇంటరాక్ట్​ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఇన్నొవేషన్  ఎకోసిస్టంలో టీహబ్ ది కీలకపాత్ర

ఐటీ ఎగుమతులు, ఆర్థిక వృద్ధిని నడపడానికి మిడ్ మార్కెట్  గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కీలకమైనవని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. శుక్రవారం టీహబ్​లో జరిగిన జీసీసీ ఇన్నొవేషన్​ సమ్మిట్ కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, క్లౌడ్​ కంప్యూటింగ్​లో హైదరాబాద్​ యువతకు అసాధారణ ప్రతిభ ఉందన్నారు. సహాయక విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలతో జీసీసీలను ఆకర్షించడానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇన్నొవేషన్​ ఎకో సిస్టంలో టీహబ్​ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. అందరూ కలిసి రాష్ర్టాన్ని గ్లోబల్​ టెక్నాలజీ హబ్​గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.