వనపర్తి, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర కక్షగట్టిందని, ఇక్కడ పథకాలను చూసి బీజేపీ పెద్దలకు కండ్లు మండుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం సల్కెలాపూర్‌లో నూతన బస్ స్టాప్, పర్వతాపూర్‌లోని శివ రామాలయం ఆర్చ్‌ని ప్రారంభించారు. అలాగే రోడ్డుమీది తండా, వెంకటాంపల్లి, దొంతికుంట తండా, సోలీపూర్‌లో జీపీ భవనాలు, గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆర్చ్, కుంట ముందరితండాలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ , సోలీపూర్‌లో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. రైతులు పంటలు పండితే ఎక్కడ ఆరబోసుకోవాలని, కల్లాలు అవసరం లేదా..? అని ప్రశ్నించారు. కల్లాలకు ఇచ్చిన డబ్బులను వాపస్ అడగడం సిగ్గుచేటన్నారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలకే పరిమితం అయ్యిందని.. దేశంలో రైతులు నిత్యం అవస్థలు పడుతున్నారని వాపోయారు. దేశమంతా రైతుబంధు, రైతుబీమా అమలు చేయాలని, సాగునీటితో పాటు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు అండగా నిలిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే
రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని రైతులందరికీ అండగా నిలిచేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్‌గా స్థాపించారని చెప్పారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీలో వణుకు మొదలయిందని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాలలోనూ తెలంగాణలోని పథకాలపై చర్చ జరుగుతోందని, తప్పకుండా దేశమంతా పోటీ చేస్తామని ప్రకటించారు. రైతుబంధు ద్వారా 9 విడతలలో రూ.58 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, పదోవిడత కింద బుధవారం నుంచి 66 లక్షల మంది ఖాతాల్లో రూ.7600 కోట్లు జమ చేయనున్నామని చెప్పారు. త్వరలోనే రైతు రుణమాఫీ హామీని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఖిల్లా ఘనపురం ఎంపీపీ కృష్ణ నాయక్, జడ్పీటీసీ సౌమ్య నాయక్, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు.